నరకం చూస్తున్న నగరవాసి.. ఎటు వైపు చూసినా నీళ్లు.. కన్నీళ్లే..!

Hyderabad Floods : పదేళ్లలో ఎన్నడూ చూడని వాన.. వరద గోదారిలో కళ్లముందే మనుషులు కొట్టుకుపోయారు.. చూస్తుండగానే కార్లు, బైక్‌లు ప్రవాహంలో మునిగి పోయాయి… జనావాసాలు కూలిపోయాయి.. డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహించాయి.
గంటల వ్యవధిలో బతుకు దుర్భరంగా మారింది. నిస్సహాయ స్థితిలో నగరవాసి నరకం చూస్తూనే ఉన్నాడు. ఈ ఏరియా ఆ ఏరియా అని తేడా లేదు.. హైదరాబాద్ అంతటా ఒకటే సిట్యువేషన్.
నీళ్లు.. కన్నీళ్లు.. ప్రభుత్వం రెండు రోజులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీస్‌లకు సెలవులు ప్రకటించిందంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో ఊహించుకోవచ్చు. దశాబ్దకాలంలో ఎన్నడూలేని విధంగా వర్షాలు ముంచెత్తాయి.
గంటల తరబడి నాన్‌స్టాప్‌గా జోరు వాన పడుతుంటే నగరవాసి గుండెల్లో దడ పుట్టింది. తెల్లారితే ఉంటామా.. పోతామా.. అసలు పరిస్థితి ఏంటన్న గుబులు.. రాత్రంతా మేల్కొనేలా చేసింది.
చాలా కాలనీల్లో విద్యుత్ నిలిచిపోయింది. ఇళ్లల్లోకి నీళ్లు చేరి నగరం నరకం చూసింది.
చినుకు పడితే బతుకు చీకటవుతోంది :
భారీ వానలకు చెరువులు నిండాయి.. కాలనీలను వరదలు ముంచెత్తాయి.. ఈ వరద ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏంటి..? నగరం జలవిలయంలో చిక్కుకుని విలవిలలాడాల్సిందేనా..?
దిల్‌షుఖ్‌నగర్‌లో భూమి ఎందుకు కుంగిపోయింది..? నిండుకుండలా కనిపిస్తున్న హిమాయత్‌సాగర్‌కు వరద పోటు ఎక్కువైతే జరిగే పరిణామం ఏంటి..?
ఈ ముప్పును ముమ్మాటికి జీహెచ్‌ఎంసీ పసిగట్టలేదు.. అసలు ముప్పును పసిగట్టే వ్యవస్థే మన దగ్గర లేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. జడివానలు జడిపించేలా చేస్తున్నా.. తూతూ మంత్రంగా చర్యలు చేపడుతూ జీహెచ్‌ఎంసీ ఇప్పటికీ కాలం వెళ్లదీస్తూనే ఉంది.
అందుకే చినుకు పడితే నగరవాసి ఉలిక్కి పడుతున్నాడు. భద్రతకు భరోసా ఏదని వణికిపోతున్నాడు.
వరద భయంతో బయటకు రాని జనం :
కాలనీలు, రహదారులు చెరువుల్ని తలపించాయి. ఇళ్లల్లో నీళ్లు చేరినా జనాలు బయటకు వచ్చే సాహసం చేయలేదు. సునామీలా పోటెత్తిన వరదలో తామెక్కడ గల్లంతవుతామో అన్న ఆందోళన అందరిలోనూ కనిపించింది. అందుకే ఇళ్లపైకి ఎక్కారు.
ముందు ముందు సిట్యువేషన్ ఎలా ఉంటుందోనన్న భయం వారిలో స్పష్టంగా కనిపించింది. చాలా ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్ సెల్లార్లలో వరదనీరు చేరింది.
అందులో ఉండేవాళ్లంతా ఫ్లాట్లకే పరిమితమై బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు.. ఈ వర్షాలు ఎన్నో సవాళ్లు విసిరాయి.
ఎక్కడా కనిపించని జీహెచ్‌ఎంసీ సిబ్బంది :
వరద గుప్పిట్లో చిక్కుకుని కాలనీలు విలవిల్లాడాయి. కానీ ఎక్కడా జీహెచ్‌ఎంసీ సిబ్బంది, మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్‌ఎఫ్ బృందాలు పెద్దగా కనిపించలేదు. జనం సాయం కోసం ఆశగా చూసినా ఎవరూ పట్టించుకోలేదు. సమాచారం తెలిసినా అటు దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు.
విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన అధికార యంత్రాంగం మిన్న కుండిపోయింది. గట్టిగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన సందర్భాలు కనిపించలేదు.
కనీసం సెల్లార్లలో నీటిని తోడే మోటార్లు కూడా బిగించలేదు. ముంచెత్తే వానకు భయపడుతున్న నగరవాసులకి.. అధికారుల చేతగానితనం మరింత కలవరపెట్టింది.
డ్రైనేజీ వ్యవస్థకు ప్రత్యేక ప్రణాళిక :
1908లో మూసీ నదిలో వరద వచ్చినప్పుడు నాటి 6వ నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్.. సిటీకి మాస్టర్ ప్లాన్ అవసరమని భావించారు.
దాన్ని రూపొందించేందుకు ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి స్వయంగా మాట్లాడారు. చెరువులు, కుంటలను కలుపుతూ డ్రైనేజీ వ్యవస్థకు ప్రత్యేక ప్రణాళిక రెడీ చేశారాయన.
దాని నిర్మాణానికి 7వ నిజాం నవాబు ఉస్మాన్ అలీఖాన్ 1911లో శ్రీకారం చుట్టి పూర్తిచేయించారు. నాటి పాలకుల దూరదృష్టి.. రాను రాను కరువైంది. అందుకే నగరాన్ని వానలు, వరదలు జనాన్ని బెంబేలెత్తిస్తూనే ఉన్నాయి. ఎవర్నో ఒకర్ని పొట్టనబెట్టుకుంటూనే ఉన్నాయి.