Karnataka Elections Result: గెలిపించిన అన్నాచెల్లెళ్లు.. తెలంగాణలోనూ కాంగ్రెస్‌ను గెలిపిస్తారా?
Karnataka Elections Result: తెలంగాణలోనూ కాంగ్రెస్ ను రాహుల్, ప్రియాంక గెలిపించినా ఆశ్చర్యం లేదు.

Rahul gandhi, priyanka
Congress: మరికొన్ని నెలల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. తెలంగాణలో బలపడుతున్న బీజేపీ (BJP).. తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోతుందని ప్రచారం. మరోవైపు, వచ్చే ఏడాదే లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections 2024).. 2014లో ప్రారంభమైన బీజేపీ హవా ఇప్పటికే దేశంలో కొనసాగుతోంది.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపదన్న ప్రచారం.. కాంగ్రెస్ నాయకత్వలేమితో బాధపడుతుందన్న విమర్శలు. ఇటువంటి సమయంలో ఏదేమైనా సరే కర్ణాటకలో గెలవడమే ప్రాధాన్యతాంశంగా పెట్టుకున్నాయి కాంగ్రెస్, బీజేపీ. కాంగ్రెస్ ను గెలిపించే సత్తా ఆ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi ), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) కి లేదన్న విమర్శలు పటాపంచలు అయ్యాయి.
కేంద్రంలో బీజేపీ, కర్ణాటకలో బీజేపీ.. అయినప్పటికీ ఆ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు.. ఎలా సాధ్యమైంది? కర్ణాటక ఎన్నికల ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగిసింది. కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యతలను ఆ రాష్ట్ర నేతలే కాకుండా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా తమ భుజాన వేసుకున్నారు.
ప్రచారంలో రాహుల్, ప్రియాంక పోటీ అనేలా..
కర్ణాటకలో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ ను కష్టపడిన తీరు చూస్తే రాహుల్ గాంధీ కంటే ఆమే ఎక్కువ శ్రమపడ్డారని అనిపిస్తోంది. రాహుల్ గాంధీ నిర్వహించిన ర్యాలీలు ప్రచారం చేస్తూ ప్రియాంక గాంధీ కంటే ఎక్కువ ఆయనే కష్టపడ్డారనిపిస్తోంది. ఈ అన్నాచెల్లెళ్లు కర్ణాటక ఎన్నికల్లో గెలుపే సంకల్పంగా పెట్టుకుని ఒకరితో ఒకరు పోటీ పడుతూ ప్రచారం చేశారా? అన్న సందేహం కలుగుతోంది.
ఎంతగా కష్టపడ్డారంటే..
అందుకు ఈ గణాంకాలే రుజువు. కర్ణాటకలో రాహుల్ గాంధీ 18 ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు. ప్రియాంక గాంధీ మొత్తం దాదాపు 20 ర్యాలీలు, రోడ్ షోల్లో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం వేళ రాహుల్ గాంధీ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. డెలివరీ బాయ్ స్కూటర్ పై వెళ్లారు. ప్రియాంక గాంధీ గతంలో యూపీ ఎన్నికల సమయంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మళ్లీ అదే రీతిలో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
తెలంగాణలోనూ ఇదే రిపీట్ అవుద్దా?
కొన్ని నెలల్లో తెలంగాణలోనూ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ జోడో యాత్ర ద్వారా, ప్రియాంక గాంధీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ద్వారా తెలంగాణలో పర్యటనలు జరిపారు. కర్ణాటక ఎన్నికల్లో అనుసరించిన వ్యూహమే వచ్చే తెలంగాణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అనుసరించే అవకాశం ఉంది. కర్ణాటకలో గెలవడంతో నిధుల కొరత కూడా ఉండదు. తెలంగాణలోనూ కాంగ్రెస్ ను రాహుల్, ప్రియాంక గెలిపించినా ఆశ్చర్యం లేదు. దేశంలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ పేరు ప్రముఖంగా ఉంది.
Siva Shankarappa : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 92ఏళ్ల కాంగ్రెస్ నేత శివశంకరప్ప మరోసారి గెలుపు