Breaking News: తెలంగాణ కేబినెట్ లోకి అజారుద్దీన్.. ఎల్లుండే ప్రమాణస్వీకారం!
మైనారిటీకే చెందిన అజారుద్దీన్ కు మైనారిటీ వ్యవహారాల శాఖ ఇచ్చే అవకాశాలు ఉండొచ్చని అంచనా.
తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగబోతోంది. ఈనెల 31న తెలంగాణ కేబినెట్ ను విస్తరించనున్నారు. అజారుద్దీన్ కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా నామినేట్ అయిన అజారుద్దీన్ ఇంకా ప్రమాణస్వీకారం చేయలేదు. అయితే, ఈ లోపు మంత్రిగా ప్రమాణం చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయనున్నారు. జూబ్లిహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అజారుద్దీన్ గత ఎన్నికల్లో జూబ్లిహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే, ఉప ఎన్నికలు రావడంతో మళ్లీ టికెట్ ఆశించారు. కానీ, కొన్ని సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి.. అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా పంపారు. నవీన్ యాదవ్ ను అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపారు.
ఏ మంత్రి పదవి దక్కొచ్చు?
తెలంగాణ కేబినెట్ లో మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరూ లేరు. ఆ శాఖ బాధ్యతలను కూడా సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. మైనారిటీకే చెందిన అజారుద్దీన్ కు మైనారిటీ వ్యవహారాల శాఖ ఇచ్చే అవకాశాలు ఉండొచ్చని అంచనా. జూబ్లిహిల్స అసెంబ్లీలో మైనారిటీలు నిర్ణయాత్మక ఓట్ బ్యాంక్ ఉంది. అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేయగలరు. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా మైనారిటీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
