Aviation Industry : తెలంగాణ గ్యారేజ్.. ఇక్కడ విమానాలు రిపేరు చేయబడును

రాష్ట్రంలో వైమానిక రంగం వాటి అనుబంధ పరిశ్రమల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇది అభివృధ్ది చెందితే దీనితో పాటు అంతరిక్ష, రక్షణ రంగాలకు చెందిన పరిశ్రమలు కూడా అభివృధ్ది చెందుతాయని అందుకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు పై తెలంగాణ సర్కార్ దృష్టి సారిచింది.

Aviation Industry : తెలంగాణ గ్యారేజ్.. ఇక్కడ విమానాలు రిపేరు చేయబడును

Aviation Industry In

Updated On : April 15, 2021 / 7:50 AM IST

Aviation Industry in Telangana : రాష్ట్రంలో వైమానిక రంగం వాటి అనుబంధ పరిశ్రమల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇది అభివృధ్ది చెందితే దీనితో పాటు అంతరిక్ష, రక్షణ రంగాలకు చెందిన పరిశ్రమలు కూడా అభివృధ్ది చెందుతాయని అందుకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు పై తెలంగాణ సర్కార్ దృష్టి సారిచింది. వైమానిక, రక్షణ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫాక్చరింగ్‌ (ఓఈఎం) కంపెనీలు ఇప్పటికే పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చాయి.

దీంతో ఐదేళ్లుగా రాష్ట్రం ఏరోస్పేస్‌ హబ్‌గా మారుతోంది. ఈ రంగాల్లో కొత్తగా వస్తున్న నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌ హాలింగ్‌ (ఎంఆర్‌వో) రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆసక్తి చూపుతోంది. ఎంఆర్‌వో రంగంలో అంతర్జాతీయంగా అవకాశాలు పెరుగుతుండటంతో కొత్త అవకాశాలతో భారత్‌తో పాటు మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాల అవసరాలు తీర్చొచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఇప్పటికే శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జీఎంఆర్‌ ఏరోటెక్, ఎయిర్‌ ఇండియా ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎంఆర్‌వో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. బేగంపేట విమానాశ్రయంలో ఎంఆర్‌వో హబ్‌ ఏర్పాటు చేసేందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆసక్తి చూపిస్తూ ఉండటంతో నిర్వహణ, మరమ్మ తులు, ఓవర్‌ హాలింగ్‌ రంగంలో పెట్టుబడులు ఆకర్షించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. భారత్‌లో ఎంఆర్‌వో రంగం ఏటా 15% వృద్ధి రేటుతో ప్రస్తుతం రూ.10వేల కోట్ల పరిశ్రమగా ఎదుగుతుండటంతో మహారాష్ట్ర, ఢిల్లీ ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకుంటున్నాయి. తెలంగాణ కూడా వీటి బాటలోనే నడవాలని నిర్ణయించింది.

వైమానిక, రక్షణ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫాక్చరింగ్‌ (ఓఈఎం) కంపెనీలు ఇప్పటికే పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చాయి. దీంతో ఐదేళ్లుగా రాష్ట్రం ఏరోస్పేస్‌ హబ్‌గా మారుతోంది. గత ఐదేళ్లుగా అంతర్జాతీయంగా పేరు పొందిన కంపెనీలు హైదరాబాద్ నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. వాటిలో లాక్‌హీడ్‌ మార్టిన్, బోయింగ్, జీఈ ఏవియేషన్‌ వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు టాటా, అదానీ, కల్యాణి వంటి దేశీయ కంపెనీలు కూడా ఉన్నాయ.

టాటా గ్రూప్‌ తమ ఏరోస్పేస్‌ ఉత్పత్తుల్లో 90 శాతం హైదరాబాద్‌ నుంచే తయారు చేస్తోంది. జీఈ, సాఫ్రాన్‌ హైదరాబాద్‌లో ఏరో ఇంజిన్‌ తయారీ కర్మాగారాలను ఏర్పాటు స్థాపించగా, బోయింగ్‌ సంస్థ అపాచీ, చినోక్స్‌ హెలీకాప్టర్లు, యుద్ధ విమానాల విడిభాగాలు, లాక్‌హీడ్‌ హెలికాప్టర్‌ క్యాబిన్లు, ఎఫ్‌–16 రెక్కలను తయారుచేస్తోంది.

అంతర్జాతీయ ఏరోస్పేస్‌ సంస్థలు సీఎఫ్‌ఎం, ఫ్రాట్‌ అండ్‌ విట్నీ రాష్ట్రంలో ఇంజిన్‌ ట్రైనింగ్‌ సెంటర్లు కూడా నిర్వహిస్తున్నాయి. వైమానిక, రక్షణ రంగాల్లో అంతర్జాతీయ పెట్టుబడులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు నైపుణ్య శిక్షణపై దృష్టి సారించడం ద్వారా ఎంఆర్‌వో రంగం కూడా వృద్ధి చెందుతుందని పరిశ్రమల శాఖ వర్గాలు భావిస్తున్నాయి.

ఇప్పటికే రాష్ట్రంలో సుమారు డజను వరకు డీఆర్‌డీఓ పరిశోధనశాలలు, ప్రభుత్వరంగ సంస్థలు ఉండగా, ఏరోస్పేస్‌ రంగంలో 25కు పైగా పెద్ద కంపెనీలు, సుమారు 1,200 వరకు అనుబంధ పరిశ్రమలు పని చేస్తున్నాయి. ఏరోస్పేస్‌ రంగం కోసం ఆదిబట్ల, ఎలిమినేడు ఏరోస్పేస్‌ పార్కులతో పాటు కొత్తగా మరో 3 కొత్త పార్కులను కూడా ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఎంఆర్‌వో రంగంలో నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో కొత్తగా శిక్షణ సంస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. పౌర విమానయాన రంగంలో ఐఎస్‌బీ ద్వారా సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్, ఏరోనాటికల్‌ సొసైటీ ద్వారా ఏరోస్పేస్, డిఫెన్స్‌ రంగాల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (భూమిని కేటాయించారు) ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. అంతర్జాతీయ సంస్థలతో కలసి రాష్ట్ర ప్రభుత్వం ఏరోస్పేస్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఏరోస్పేస్‌ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహిచేందుకు ‘టి హబ్‌’ఇప్పటికే అంతర్జాతీయ ఏరోస్పేస్‌ సంస్థలు బోయింగ్, ప్రాట్‌ అండ్‌ విట్నీ, కాలీన్స్‌ ఏరోస్పేస్‌ తదితరాలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది.