ఢిల్లీ పాలిటిక్స్ నుంచి గల్లీ పాలిటిక్స్‌కు మకాం.. ఈ నేత ఎందుకిలా చేస్తున్నారు?

ఆయన కోరుకున్నట్లే ఆ పోస్ట్ వస్తుందా?

 ఢిల్లీ పాలిటిక్స్ నుంచి గల్లీ పాలిటిక్స్‌కు మకాం.. ఈ నేత ఎందుకిలా చేస్తున్నారు?

Updated On : April 9, 2025 / 3:38 PM IST

తెలంగాణ పాలిటిక్స్ లో ఓ నేత గురించి హాట్ హాట్ గా పొలిటికల్ డిబేట్ జరుగుతోంది. ఆ నేత కూడా ఢిల్లీ పాలిటిక్స్ నుంచి గల్లీ పాలిటిక్స్ కు మకాం మార్చడంపై రకరకాల చర్చ జరుగుతోంది. లోకల్ పాలిటిక్స్ లో అంతా తానే అన్నట్లుగా హడావిడి చేస్తున్నారంట. అయితే సదరు నేత అంతగా హడావిడి చేయడానికి వెనుక కారణం లేకపోలేదనే చర్చ కూడా జరుగుతోంది. ఇంతకీ ఎవరా నేత..? ఆ నేత అంతగా హడావిడి చేయడానికి గల కారణం ఏంటి..? ఆ పోస్టు కోసమే ఆయన అంతగా తాపత్రపడుతున్నారా?

తెలంగాణలో ఓ పోస్టుపై కన్నేసిన ఓ నేత ఆ పోస్టును దక్కించుకునేందుకు ఢిల్లీ పాలిటిక్స్ నుంచి హైదరాబాద్ గల్లీ పాలిటిక్స్పై ఫోకస్ పెట్టారనే చర్చ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో జోరుగా జరుగుతోంది. సదరు నేత లోకల్ పాలిటిక్స్పై మమకారం పెంచుకోవడానికి కారణం కూడా ఉందట. ఇప్పుడు సదరు నేత గురించే గాంధీభవన్లో తెగ చర్చ నడుస్తోంది.

ఆయనే మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా పార్టీ హైకమాండ్ కు చాలా దగ్గరగా ఉంటారనే చర్చ ఉంది. నినా మొన్నటి వరకు ఏఐసీసీ ఆఫీస్ లో కేసీ వేణుగోపాల్ తర్వాత పార్టీ వ్యవహారాలను కూడా చక్కబెట్టేవారట. కానీ ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి హైదరాబాద్ లోనే మకాం వేశారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఢిల్లీలో ఎంత పెద్ద పొగ్రామ్ జరిగినా అటువైపు కన్నెత్తి కూడా చూడటంలేదట. ఇంత సడన్ గా హస్తినను పక్కన పెట్టడానికి పెద్ద స్కెచ్ వేశారనే టాక్ వినిపిస్తోంది.

ఇక్కడ కీరోల్ పోషించాలని వంశీచంద్ ప్లాన్?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉండటంతో ఇక్కడ కీరోల్ పోషించాలని వంశీచంద్ ఉవ్విళ్లూరుతున్నారట. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో..కనీసం పార్టీలో మంచి పట్టు సాధించాలని ఆశపడుతున్నారట. అందుకే ఈ మధ్య కొత్త ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ రావడంతో వంశీ కూడా హడావిడి మొదలుపెట్టారట. పార్టీ కొత్త కార్యవర్గం ఏర్పాటు విషయంలో కూడా జోక్యం చేసుకుంటున్నారట.

కొత్త కార్యవర్గంలో స్థానం కోసం రేసులో ఉన్న వారికి ఫోన్లు చేసి మరీ వారీ బయోడేటాలను తీసుకొని ఇంచార్జ్ కు అందజేస్తున్నారట. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంచార్జ్ మీనాక్షికి అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని గాంధీభవన్ వర్గాల్లో ఓ టాక్ నడుస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకొని నేతలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారంట. చివరకు HCU భూముల వ్యవహారం విషయంలో మంత్రులతో ఇంచార్జ్ మీనాక్షి నిర్వహించిన సమీక్షకు సైతం వంశీ హాజరయ్యారని సమాచారం. HCU స్టేక్ హోల్డర్లతో అంటే ప్రొఫెసర్ల సంఘం, విద్యార్థి సంఘం నేతలతో నిర్వహించిన సమావేశంలో కూడా వంశీ చేసిన హడావిడే అందరికి కనిపించిందట.

వంశీచంద్ రెడ్డి ఇంత హడావిడి చేయడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందని గాంధీభవన్ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. త్వరలో ఏర్పాటు చేయబోయే కొత్త కార్యవర్గంలో మంచి పోస్ట్ సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారట. టీ-పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు కొత్త కార్యవర్గం ఏర్పాటు కాలేదు.

అయితే కొత్త కార్యవర్గంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు దక్కించుకోవాలని వంశీ తాపత్రయపడుతున్నారని గాంధీభవన్లో టాక్ నడుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ విత్ ఆర్గనైజేషన్ పోస్టు కావాలని కోరుతున్నారట. ఈ పోస్టు దక్కితే తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చని వంశీ భావిస్తున్నారట. అందుకే ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు దగ్గరగా ఉండేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ వర్గాల్లో టాక్ విన్పిస్తోంది.

మొత్తం మీద కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విత్ ఆర్గనైజేషన్ పోస్టు కోసం వంశీచంద్ రెడ్డి పెద్ద స్కెచ్ వేశారట. అయితే ఆ పోస్టు దక్కించుకోవడం కోసం వంశీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఆయన కోరుకున్నట్లే ఆ పోస్ట్ వస్తుందా? లేక ఢిల్లీకే పరిమితం అవుతారా అన్నది రాబోయే రోజుల్లో తేలిపోనుంది.