టీడీపీకి ఓటు వేస్తే వైసీపీకి పడుతోంది : ఈసీకి చంద్రబాబు లేఖ

అమరావతి : ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఈవీఎంల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీకి ఘాటుగా లేఖ రాశారు. ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 30శాతం ఈవీఎంలు పని చెయ్యడం లేదని ఫిర్యాదు చేశారు. ఈవీఎంలు మొరాయించడంతో ప్రజల్లో అసహనం కనిపిస్తోందన్నారు. పోలింగ్ కేంద్రాల వరకు వచ్చిన ఓటర్లు.. ఓటు వేయకుండానే వెనక్కి వెళ్లిపోతున్నారని లేఖలో చెప్పారు. టీడీపీకి ఓటు వేస్తే వైసీపీకి పడుతోందనే ఫిర్యాదులు వస్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లో ఈవీఎంలపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని ఈసీకి రాసిన లేఖలో చంద్రబాబు తెలిపారు.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలను తాము అంగీకరించబోమని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈవీఎంలు పని చేయకపోవడంతో ఇప్పటికే 3 గంటల సమయం వృథా అయిందని అన్నారు. ఈవీఎంలు పనిచేయని చోట రీపోలింగ్ నిర్వహించాలని చంద్రబాబు ఈసీని డిమాండ్ చేశారు. ఈవీఎంల పనితీరుపై రాష్ట్రమంతా ఫిర్యాదులు వస్తున్నాయని, ఓటర్లు ఆందోళనలో ఉన్నారని చంద్రబాబు చెప్పారు. అన్ని పోలింగ్ బూత్ లలో ఓటర్లు మొత్తం వచ్చి ఓటేసేంత సమయం లేదని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల సంఘం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓటర్లు ఆందోళన చేస్తున్నా అధికారులు ఎవరూ స్పందించడం లేదని చంద్రబాబు సీరియస్ అయ్యారు.
ఈవీఎంలతో జరిగే నష్టం ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ కు తెలిసి వచ్చి ఉంటుందని చంద్రబాబు అన్నారు. గురువారం(ఏప్రిల్ 11,2019) ఉదయం 7గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా, పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినట్టు వస్తున్న వార్తలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ ఓటేసేందుకు వెళ్లిన కేంద్రంలోనే ఈవీఎం పనిచేయకపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని పోలింగ్ బూత్ కి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన చంద్రబాబు… ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈవీఎంల దుర్వినియోగంపై తాను ఎప్పటినుంచో మాట్లాడుతున్నానని, ఇప్పటికైనా ఈసీ అర్థం చేసుకోవాలని, ఈవీఎంలతో జరిగే నష్టాన్ని గుర్తించాలని కోరారు. బ్యాలెట్ అయితే ఏ సమస్యా ఉండదన్నారు. ఈవీఎంల వాడకంపై రివిజన్ పిటిషన్ వేయాలన్న ఆలోచనలో ఉన్నామని చంద్రబాబు తెలిపారు.