టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు, ముళ్ల కంచెలు : రాజధాని గ్రామాల్లో టెన్షన్..టెన్షన్

ఏపీ రాజధాని గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ వైపు సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం... మరోవైపు ఆ సమావేశంలో తీసుకొనే నిర్ణయంపై ఆందోళనలు... వాటిని

  • Published By: veegamteam ,Published On : December 27, 2019 / 04:28 AM IST
టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు, ముళ్ల కంచెలు : రాజధాని గ్రామాల్లో టెన్షన్..టెన్షన్

Updated On : December 27, 2019 / 4:28 AM IST

ఏపీ రాజధాని గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ వైపు సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం… మరోవైపు ఆ సమావేశంలో తీసుకొనే నిర్ణయంపై ఆందోళనలు… వాటిని

ఏపీ రాజధాని గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ వైపు సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం… మరోవైపు ఆ సమావేశంలో తీసుకొనే నిర్ణయంపై ఆందోళనలు… వాటిని అడ్డుకునేందుకు భారీగా రంగంలోకి దిగిన పోలీసు బలగాలు, ఇదివరకెప్పుడూ చూడని విధంగా అమరావతిలో ఖాకీల కవాతు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు.. కేబినెట్ తీసుకునే నిర్ణయం ఏ రకంగా ఉంటుందోనని అన్నదాతల్లో ఆందోళన కొనసాగుతుండగా…. సీఎం, మంత్రులు సచివాలయానికి వచ్చి, తిరిగి వెళ్లేవరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడటంపై పోలీసుల్లో టెన్షన్ నెలకొంది. దీంతో.. అమరావతి ప్రాంతంలో ఎక్కడ చూసినా టెన్షన్.. టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.

రాజధాని మార్పు ప్రతిపాదనలు నిర్ణయం రూపంలో మారనున్న వేళ అమరావతి గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని గ్రామాల్లో టియర్‌ గ్యాస్‌, వాటర్‌ క్యానన్లతోపాటు అగ్నిమాపక దళాలను మోహరించారు. అన్ని గ్రామాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. ప్రతీ గ్రామంలో పోలీసు పికెట్లతోపాటు, గ్రామ సరిహద్దుల్లో ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. మందడంలో నిరసనలకు అనుమతి నిరాకరించిన పోలీసులు… తుళ్లూరు ప్రాంతంలో మాత్రం శాంతియుత నిరసనలకు అనుమతిచ్చారు. ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సచివాలయానికి సీఎం, మంత్రులు రానున్నందున… వారికి ఇబ్బందులు లేకుండా.. ముందస్తుగా సచివాలయం చుట్టుపక్కల పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. సచివాలయం వెళ్లే రహదారులను పోలీసులు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. మందడం నుండి సచివాలయం వెళ్లే దారిలో ఆంక్షలు విధించారు. ప్రతి ఒక్కరినీ నిశితంగా పరిశీలిస్తున్నారు. తుళ్లూరు నుండి సచివాలయం ప్రాంతం వరకు దాదాపు 700 మంది పోలీసులను మోహరించారు. మందడం, మల్కాపురం జంక్షన్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేబినెట్ సమావేశం తరువాత కూడా పోలీసు బలగాలను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.

* రాజధాని గ్రామాల్లో టెన్షన్ టెన్షన్
* పోలీసుల వలయంలో రాజధాని గ్రామాలు
* టియర్‌ గ్యాస్‌, వాటర్‌ క్యానన్లతో రంగంలోకి దిగిన పోలీసులు
* 29 గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్ పికెట్లు, ముళ్ల కంచెలు
* మందడంలో నిరసనలకు అనుమతి నిరాకరణ
* ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
* పోలీసుల నియంత్రణలో సచివాలయం రహదారి
* సీఎం, మంత్రుల వాహనాలను అడ్డుకోకుండా ముందస్తు చర్యలు
* మందడం – సచివాలయం దారిలో ఆంక్షలు
* తుళ్లూరు – సచివాలయం మధ్య 700 మంది పోలీసుల మోహరింపు
* ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పోలీసులు
* మందడం, మల్కాపురం జంక్షన్ల దగ్గర భారీ బందోబస్తు