కడపలో హైడ్రామా : టీడీపీ ఏజెంట్ క్షేమం

ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ 11వ తేదీన ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు జరుగనున్నాయి. ఓ వైపు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తుంటే మరోవైపు పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కడప జిల్లాలో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. ఉలసపల్లికి చెందిన టీడీపీ ఏజెంట్ పద్మావతిని వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్ ఎదుట టీడీపీ ఎంపీ అభ్యర్ధి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్ది రామసుబ్బారెడ్డి, ఎంపీ సీఎం రమేష్ సహా ఇతర టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.
వైసీపీ అరాచకాలు అరికట్టాలంటూ నినాదాలు చేశారు. పద్మావతిని క్షేమంగా అప్పగించే వరకు ఆందోళన విరమించేది లేదంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. కొంత సేపటి తరువాత.. పోలీసులు పద్మావతి ఆచూకి కనుగొని ఆమెను క్షేమంగా తీసుకొచ్చారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు పద్మావతిని కిడ్నాప్ చేశారని, తమ కార్యకర్తలకు రక్షణ కల్పించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.