ఏపీకి మరో తుఫాన్ ముప్పు : ఫణి దూసుకొస్తోంది

దక్షిణ కోస్తావైపు ‘ఫణి’ తుఫాన్ దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. మరికొద్ది గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య దిశగా పయనిస్తూ తుఫాన్‌గా వాయుగుండం మారనుందని తెలిపింది. ఏప్రిల్ 30వ తేదీ లోపు దక్షిణ కోస్తాంధ్ర – ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీనితో తమిళనాడులో హై అలర్ట్ ప్రకటించారు. ఏప్రిల్ 30వ తేదీన అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఫణి తుఫాన్ ప్రభావం ఏపీపై ఉండనుందని తెలిపింది. ఏప్రిల్ 28 నుండి ఏప్రిల్ 30 తేదీల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని, భారీ ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరం దాటే సమయంలో గాలుల వేగం మరింత ఎక్కువవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అక్కడకక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది.
మరోవైపు ఫణి తుఫాన్‌తో కేరళ అలర్ట్ అయ్యింది. అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇటీవలే వరదలతో అతలాకుతలమైన కేరళపై తుఫాన్ మళ్లీ ప్రభావం చూపిస్తుందా ? అనే భయంతో కేరళ విపత్తు నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. దీని వల్ల గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.