బిర బిరా కృష్ణమ్మ : నిండుకుండల్లా ప్రాజెక్టులు

  • Published By: madhu ,Published On : October 27, 2019 / 01:14 AM IST
బిర బిరా కృష్ణమ్మ : నిండుకుండల్లా ప్రాజెక్టులు

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.. కర్నాటక లోని ఆల్మట్టి నుంచి ఏపీలో ప్రకాశం బ్యారేజీ వరకు ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి..  జూరాల, శ్రీశైలం, నాగార్జునా సాగర్ జలాశయాల నుంచి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలతో ఎన్నడూ లేనివిధంగా వరుసగా కృష్ణమ్మకు ఏడోసారి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ, పరిసర ప్రాంతాల్లో జలాశయాలు నిండుకుండలా ఉండడంతో  వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. జూరాల జలాశయానికి రెండు లక్షల 55వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి.. రెండు లక్షల 44వేల  క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

శ్రీశైలం డ్యామ్‌కూ వరద భారీగా వస్తోంది. తుంగభద్ర నుంచి శ్రీశైలానికి 50 వేలకుపైగా క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్‌కు ఆరు లక్షల క్యూసెక్కులకుపైగా  ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో 10 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నుంచి నాలుగు లక్షల 73వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక  పులిచింతలకు భారీగా వరద వస్తుండటంతో 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 

నాగార్జునసాగర్‌ జలాశయానికి భారీ ఇన్‌ఫ్లో నమోదైంది. 6 లక్షల 34వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో సాగర్‌ 8 క్రస్టుగేట్లు ఎత్తి.. వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 2లక్షల 66వేల క్యూసెక్కులుండగా.. ఔట్‌ఫ్లో 2లక్షల 66 వేల క్యూసెక్కులుంది. సాగర్‌ పూర్తి స్ధాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి  మట్టం 589 అడుగులుగా ఉంది. మరోవైపు రానున్న రెండ్రోజుల్లో  భారీ వర్షాలు కుసిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో కృష్ణమ్మకు మరింత వరద పెరిగే అవకాశం  ఉంది.