CCTV Repair : సీసీటీవీ కెమెరా రిపేరు…. ఫుటేజి చూపించి దంపతులను బ్లాక్ మెయిల్ చేసిన టెక్నీషియన్

ఇంట్లో భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న సీసీటీవీలో రికార్డైన దృశ్యాలను తస్కరించి  సీసీటీవీ టెక్నీషియన్, దంపతులను బ్లాక్ మెయిల్ చేయసాగాడు. విసిగిపోయిన దంపతులు పోలీసులను ఆశ్రయించారు.

CCTV Repair : సీసీటీవీ కెమెరా రిపేరు…. ఫుటేజి చూపించి దంపతులను బ్లాక్ మెయిల్ చేసిన టెక్నీషియన్

Cctv Repair Technician

CCTV Repair : ఇంట్లో భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న సీసీటీవీలో రికార్డైన దృశ్యాలను తస్కరించి  సీసీటీవీ టెక్నీషియన్, దంపతులను బ్లాక్ మెయిల్ చేయసాగాడు. విసిగిపోయిన దంపతులు పోలీసులను ఆశ్రయించారు. దక్షిణ ఢిల్లీలో నివసించే కరణ్ అహుజా (30) ఒక ప్రైవేట్ సంస్ధలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య ఎంఎన్‌సీ‌లో పనిచేస్తోంది. ఈ దంపతులకు ఒక పాప పుట్టింది. ప్రసవానంతర సెలవులు పూర్తి చేసుకుని దంపతులిద్దరూ ఉద్యోగాలకు వెళ్లాల్సి వచ్చింది. పసిపిల్లను చూసుకోటానికి ఇంట్లో ఒక ఆయాను ఏర్పాటు చేసి ఇద్దరూ ఉద్యోగాలకు వెళుతున్నారు.

ఈక్రమంలో ఎందుకైనా మంచిదని ఇంట్లో అంతా సీసీటీవీలు ఏర్పాటుచేసుకుని వాళ్లు ఆఫీసులో ఉన్నా కూడా చూసుకునే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. కొన్నాళ్లకు ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరా పనిచేయకపోవటంతో  దాన్ని రిపేరు చేయటానికి టెక్నీషియన్ ను పిలిచారు. సంబంధిత సంస్ధ  నుంచి ఒక వ్యక్తి వచ్చి వాటిని రిపేరు చేసి వెళ్లిపోయాడు.

కొన్నాళ్లకు అహుజా ఫోన్‌కు గుర్తుతెలియని నెంబరు నుంచి వాట్సప్ లో కొన్ని వీడియోలు వచ్చాయి. అందులో అహుజా తన భార్యతో సన్నిహితంగా ఉన్న వీడియోలు ఉన్నాయి. వాటిని చూసిషాక్‌కు గురయ్యారు అహుజా దంపతులు. కొంత సేపటి తర్వాత ఆ వీడియోలు పంపించిన వ్యక్తి వద్ద నుంచి ఫోన్ వచ్చింది.

ఈ వీడియోక్లిప్పులు సోషల్   మీడియాలో పోస్ట్ చేశానని.. తాను అడిగినంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాను అడిగినంత ఇస్తే వాటిని తొలగిస్తానని చెప్పాడు. అతను చెప్పిన నెంబరుకు, కోరిన మొత్తాన్ని అహుజా బదీలీ చేశాడు.

కొన్నాళ్లకు మళ్లీ ఆగంతకుడు ఫోన్ చేసి మళ్లీ డబ్బులు డిమాండ్ చేశాడు. అహుజూ మళ్లీ డబ్బులు పంపించాడు. అయినా ఆగంతకుడు ఆవీడియో క్లిప్పులను తొలగించలేదు. మళ్లీ మరోసారి డబ్బుకోసం  అహుజాను సంప్రదించాడు. మరో రూ.3 లక్షలు పంపించాలని డిమాండ్ చేశాడు ఆగంతకుడు. దీంతో అహుజా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్నపోలీసులు విచారణ చేపట్టారు. అహుజాకు వచ్చిన ఫోన్ నెంబర్ బెంగుళూరు నుంచి వచ్చినట్లు తెలుసుకున్నారు. సాంకేతిక సహాయంతో నిందితుడు బెంగుళూరులో నివసిస్తున్న ప్రదేశాన్ని గుర్తించారు. అతడు సీసీటీవీ టెక్నీషియన్ మహ్మద్ రషీద్‌గా గుర్తించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక పోలీసు బృందం బెంగుళూరు వెళ్లింది.

ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌గఢ్ కు చెందిన రషీద్ కొన్నాళ్ల క్రితం ఢిల్లీలోని ఒక సీసీటీవీ కెమెరాల కంపెనీలో పనిచేసేవాడు.  అక్కడ పనిచేస్తున్న రోజుల్లోనే అహుజా ఇంట్లో కెమెరాలు రిపేరు చేయటానికి వచ్చాడు. ఆపనిలో భాగంగా కంప్యూటర్లో  రికార్డైన కొన్ని దృశ్యాలను తన హార్డ్‌డిస్క్‌లో కాపీ చేసుకున్నాడు. వాటిలో అహుజా తన భార్యతో సన్నిహితంగా ఉన్న వీడియోలు కూడా ఉన్నాయి.

వాటిని  భద్రపరుచుకుని బెంగుళూరు వచ్చిన తర్వాత  ఆవీడియోలను అహుజాకు పంపించి బ్లాక్ మెయిల్ చేయసాగాడు. అతని మొబైల్లో అహుజా దంపతులకు సంబంధించిన 80 వీడియో క్లిప్పులను పోలీసులు కనుగొన్నారు.  నిందితుడిని అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకువెళ్లారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.