హైదరాబాద్‌లో దారుణం, 10 ప్రైవేట్ ఆసుపత్రులు తిరిగినా భార్యను బతికించుకోలేకపోయిన భర్త

హైదరాబాద్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రైవేట్ ఆసుపత్రుల

  • Published By: naveen ,Published On : June 20, 2020 / 03:41 AM IST
హైదరాబాద్‌లో దారుణం, 10 ప్రైవేట్ ఆసుపత్రులు తిరిగినా భార్యను బతికించుకోలేకపోయిన భర్త

హైదరాబాద్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రైవేట్ ఆసుపత్రుల

హైదరాబాద్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాకానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఓ భర్తకు భార్యను దూరం చేసింది. ఒకటి, రెండు కాదు ఏకంగా పది ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగినా లాభం లేకపోయింది. ఆ మహిళను చేర్చుకునేందుకు ఆసుపత్రులు నిరాకరించాయి. దీంతో భర్త కళ్ల ముందే భార్య ప్రాణాలు విడిచింది. దీనికంతటికి కారణం కరోనా భయం. అవును, అర్థం లేని భయాలతో ప్రైవేట్ ఆసుపత్రులు ఓ నిండు ప్రాణం పోవడానికి కారణమయ్యాయి.

కొన్ని రోజులుగా జ్వరం, జలుబు, ఆయాసం:
అత్తాపూర్‌కు చెందిన రోహిత(41) అనే మహిళ గత కొద్దిరోజులుగా జ్వరం, జలుబు, ఆయాసంతో బాధపడుతోంది. ట్రీట్‌మెంట్‌ కోసం భర్త శ్రీకాంత్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అక్కడున్న సిబ్బంది ఆమెను చేర్చుకోవడం కుదరదన్నారు. ఆమెకు కరోనా ఉందమోననే భయంతో తిప్పి పంపేశారు. దీంతో శ్రీకాంత్ మరో దారి లేక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడా అదే సమాధానం. కంగారుపడ్డ శ్రీకాంత్ తన భార్యను మరో హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. అక్కడా అదే జవాబు. కరోనా ఉందేమో అనే భయంతో ఆసుపత్రిలో రోహితను చేర్చుకోవడం కుదరదని చెప్పి పంపేశారు. 

10 ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగినా:
ఇలా పది ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ రోహిత భర్త శ్రీకాంత్ తిరిగాడు. అందరి నుంచి ఒకటే సమాధానం రావడంతో విసిగిపోయిన శ్రీకాంత్, చివరికి రోహితను తీసుకుని గాంధీ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ చేర్చించిన కొద్ది నిమిషాలకే రోహిత చనిపోయింది. దీంతో శ్రీకాంత్ కన్నీరుమున్నీరుయ్యాడు. బోరున విలపించాడు. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య చనిపోయిందని శ్రీకాంత్ ఆరోపించాడు. రోహిత మృతిపై మానవ హక్కుల సంఘంలో పిటిషన్ కూడా వేశాడు. కరోనా ఉందో లేదో తెలుసుకోకుండానే అవనసర భయాలు, అనుమానాలతో తన భార్యను చంపేశారని గుండెలు పగిలేలా ఏడ్చాడు.

ఏ ఆస్పత్రికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు:
రాత్రి నుంచి ఉదయం దాకా అనారోగ్యంతో ఉన్న భార్యను వెంటబెట్టుకుని 10 ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగాడా భర్త శ్రీకాంత్. కానీ ఏ ఆస్పత్రిలో ఏ ఒక్క వైద్యుడు కూడా ఆమెను పరీక్షించలేదు. వైద్యం చేయలేదు. చివరకు జ్వరం.. శ్వాసకోశ సంబంధ సమస్యలతో ఆమె ప్రాణాలు విడిచింది. సరైన సమయంలో వైద్యం అందకపోవడంతోనే తన భార్య మృతి చెందిందని భర్త శ్రీకాంత్‌ ఆరోపించాడు. శ్రీకాంత్‌-రోహిత దంపతులకు సాయితిలక్‌, సిరివెన్నెల పిల్లలు. శ్రీకాంత్‌.. బీఎస్ఎన్ఎల్ లో పని చేస్తున్నాడు.

పరీక్ష చేయకముందే కరోనా అని ఎలా నిర్ధారిస్తారు:
”వారం క్రితం రోహిత(41)కు జ్వరం, శ్వాసకు సంబంధించిన ఇబ్బందులుంటే స్థానికంగా ఉన్న ఓ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లా. తగ్గకపోవడంతో 17న రాత్రి నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లా. అక్కడ కరోనా రోగుల కోసం పడకలు లేవని చెప్పి చేర్చుకునేందుకు డాక్టర్లు నిరాకరించారు. పరీక్ష చేయకముందే కరోనా అని ఎలా నిర్ధారిస్తారని నిలదీయడంతో కొద్దిసేపు ఆక్సిజన్‌ పెట్టారు. ఆ తర్వాత తమ వల్ల కాదని డాక్టర్లు చెప్పడంతో నా భార్యను మరో కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్ళా. అక్కడా పట్టించుకోకపోవడంతో మరో రెండు ప్రైవేటు ఆస్పత్రులకు.. రెండు ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్లా. ఇలా రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నా భార్యను బతికించుకోవడానికి అన్ని ఆస్పత్రులకు తిరిగా. ఎక్కడా వైద్యం అందలేదు. కొన్ని ఆస్పత్రులు రెండు లక్షల రూపాయలు కడితేనే చేర్చుకుంటామని డిమాండ్ చేశాయి. చివరికి గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. గురువారం(జూన్ 18,2020) ఉదయం రోహిత మృతి చెందింది” అని రోహిత్ కన్నీరుమున్నీరు అయ్యారు.

సరైన సమయంలో వైద్యం అంది ఉంటే నా భార్య బతికేది:
ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లినప్పుడు వారు ఎక్స్‌రే తీశారని, అక్కడే ఆక్సిజన్‌ పెట్టి వైద్యం చేస్తే తన భార్యకు నయమయ్యేదని శ్రీకాంత్‌ వాపోయాడు. ఓ స్నేహితుడి సూచనతో కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్తే అక్కడ కొవిడ్‌ లక్షణాలున్నాయని సగం వైద్యం చేసి డొక్కు అంబులెన్స్‌లో గాంధీకి పంపించారన్నారు. గాంధీ ఆస్పత్రి దగ్గర డాక్టర్లు పట్టించుకోలేదని, నెత్తీనోరు బాదుకున్నా తన భార్యకు సరైన వైద్యం అందించలేదని వాపోయాడు. తన భార్యను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్తే బతుకుతుందని అనుకున్నానని, ఇలా తిప్పి తిప్పి చంపుతారని అనుకోలేదని శ్రీకాంత్ గుండెలు పగిలేలా రోదించాడు.

ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి:
ప్రస్తుతం అందరిలోనూ కరోనా భయం ఉంది. ఎక్కడ ఈ మహమ్మారి దాడి చేస్తుందోనని ప్రాణభయం పట్టుకుంది. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు కూడా కరోనా భయం పట్టుకుంది. కరోనా ఉందో లేదో తెలియకపోయినా భయంతో ట్రీట్ మెంట్ కి నో చెబుతున్నారు. ఏమాత్రం కరోనా లక్షణాలు కనిపించినా పేషెంట్ ను కనీసం ముట్టుకోవడం కూడా లేదు. లేదా భారీ మొత్తంలో అంటే లక్షల్లో ఫీజులు చెల్లించిన తర్వాతే పేషెంట్ ని హాస్పిటల్ లోకి అనుమతిస్తున్నారు. ఈ పరిణామాలు పేద, మధ్యతరగతి ప్రజల ప్రాణాలను రిస్క్ లో పడేస్తున్నాయి. కరోనా వైరస్ కష్టకాలంలో ఆసుపత్రులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరో రోహిత ప్రాణం పోకుండా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలంటున్నారు.

Read:నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్..!