సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం… కార్మికుడు మృతి

  • Published By: bheemraj ,Published On : October 30, 2020 / 12:19 AM IST
సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం… కార్మికుడు మృతి

Accident at Singareni coal mine : పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. బొగ్గుబావి ఓ కార్మికుడిని మింగేసింది. సింగరేణి బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో బండకింద చిక్కుకున్న కార్మికుడు నవీన్ మృతి చెందినట్లుగా అధికారులు ధృవీకరించారు. రామగుండం డివిజన్ పరిధిలోని వకీల్ పల్లి భూగర్భ బొగ్గు గనిలో జంక్షన్ పై కప్పు కూలిపోయింది. (అక్టోబర్ 29, 2020) గురువారం సాయంత్రం 41వ డీప్ 65వ లెవెల్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని నవీన్ అనే కార్మికుడు చనిపోయాడు. నవీన్ పై 10 ఫీట్ల పొడవు, 5 ఫీట్ల వెడెల్పు ఉన్న బొగ్గు పెళ్లలు నవీన్ పై పడ్డాయి. మరో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. గాయపడ్డ వారిని రక్షించేందుకు రెస్క్యూ టీం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. నవీన్ మృతదేహాన్ని వెలికి తీసేందుకు రెండు బృందాలు ప్రయత్నిస్తున్నాయి. నవీన్ కు ఇటీవలే వివాహం అయింది. నవీన్ మృతి అతని కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

విధులు ముగించుకుని మరికాసేపట్లో బయటికి వచ్చే క్రమంలోనే బొగ్గు పైకప్పు కూలడంతో నవీన్ బొగ్గు పెళ్లల కింద చిక్కుకుపోయాడు. మరో ముగ్గురు కార్మికులు ప్రాణాలతో బయటపడ్డాడు. వారిలో సతీష్ అనే కార్మికునికి స్వల్ప గాయాలవ్వడంతో చికిత్స కోసం అతన్ని గోదావరి ఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బొగ్గు పెళ్లల కింద చిక్కుకున్న నవీన్ మృతదేహాన్ని బయటికి తీసేందుకు రెండు రెస్క్యూ బృందాలు గనిలోకి దిగాయి.

అధికారులతోపాటు కార్మిక సంఘాల నేతలంతా గనిలోకి వెళ్లి అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రెస్క్యూ టీం మాత్రం ఆపరేషన్ ను కొనసాగిస్తోంది. పెద్ద ఎత్తున బొగ్గు పెళ్లలు కూలిపడటంతో బొగ్గు పెళ్లలను తొలగిస్తున్నారు. అయితే బొగ్గు పెళ్లలను తొలగించేందుకు ఇంకా చాలా గంటలు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బొగ్గు పెళ్లలు పెద్ద ఎత్తున ఉండటం వల్ల వాటిని తొలగించడం కొంత కష్ట సాధ్యంగా ఉన్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి.