ప్రధాని మోదీతో చంద్రబాబు నాయుడు సమావేశం

Chandrababu Naidu : శనివారం చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం కానున్న నేపథ్యంలో వారి ఢిల్లీ పర్యటన..

ప్రధాని మోదీతో చంద్రబాబు నాయుడు సమావేశం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించారు. ఏపీకి కేంద్రం ప్రభుత్వం అందించాల్సిన ఆర్థిక సాయం, కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర అంశాలకు నిధుల కేటాయింపు అంశాలను ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర విభజన హామీల అమలుతో పాటు పోలవరం నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టుల మంజూరుపై చంద్రబాబు చర్చించారు. అలాగే, పారిశ్రామిక రంగాలకు రాయితీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందించాలని ప్రధాని మోదీని చంద్రబాబు నాయుడు కోరినట్లు సమాచారం.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రధానితో సమావేశం అవుతారు. అలాగే, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోనూ ఇరువురు సీఎంలు భేటీ అవుతారు. ఏపీ, తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలపై మోదీ, అమిత్ షాతో సీఎంలు చర్చలు జరుపుతారు.

హైదరాబాద్‌లో శనివారం చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం కానున్న నేపథ్యంలో వారి ఢిల్లీ పర్యటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో చంద్రబాబు, రేవంత్ రెడ్డి విడివిడిగానూ భేటీ అవుతారు.

ఇవాళ, రేపు చంద్రబాబు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర సర్కారు మద్దతు, సహకారం ఎజెండాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన సాగనుంది. అలాగే, తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ ఛీఫ్ నియామకంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలు జరిపిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు.

Also Read: దానం నాగేందర్‌‌ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు? ఇంతకీ బీజేపీ వ్యూహం ఏంటి?