Kandula Durgesh : తల్లిని చెల్లిని గెంటేసిన మీరు మహిళల గురించి మాట్లాడటం హాస్యాస్పదం- సీఎం జగన్ పై కందుల దుర్గేశ్ ఫైర్
జనసేన-టీడీపీ పొత్తు చూసి జగన్ కి వణుకు పుట్టింది. రాక్షస సంహారం కోసం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలుస్తారు. Kandula Durgesh

Kandula Durgesh Slams CM Jagan (Photo : Google)
Kandula Durgesh Slams CM Jagan : ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్. తన తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన మనిషి కుటుంబ మహిళ గురించి చెప్పడం హాస్యాస్పదం అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ సమాజానికి క్షమాపణ చెప్పాలని కందుల దుర్గేశ్ డిమాండ్ చేశారు. సభ్య సమాజం తల దించుకునేలా సీఎం జగన్ ఇవాళ మాట్లాడారని కందుల దుర్గేశ్ ధ్వజమెత్తారు. ఆడవారిని ఆట వస్తువులా భావించి వికృత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు.
”ముఖ్యమంత్రి జగన్ తన ప్రసంగంలో సగం సమయం జనసేన పార్టీని విమర్శించడానికి కేటాయిస్తున్నారు. పేదల పక్షాన నిలబడే మా నాయకుడు నిజంగా పేదవాడే. మీకు మాత్రం హైదరాబాద్, బెంగుళూరు, కడపలో ఆస్తులు ఉండొచ్చు. మిగిలిన వారికి ఎవరికీ ఉండకూడదా…? ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఎస్సీలు, ఎస్టీల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు.
జనసేన-టీడీపీ పొత్తు చూసి జగన్ కి వణుకు పుట్టింది. బస్సు యాత్రలో ఎమ్మెల్యేలు మాత్రమే వెళతారు. ఆయన మాత్రం హెలికాప్టర్ లో దిగుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిసి హక్కు అందరికీ ఉంది. అందులో భాగంగానే నారా లోకేశ్ అమిత్ షాను కలిశారు. రాజకీయాల్లో పొత్తులు సహజం. రాక్షస సంహారం కోసం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలుస్తారు” అని కందుల దుర్గేశ్ అన్నారు.