నీ కూతుర్ని వెతకాలంటే మా బండిలో డీజిల్ పోయించు…పోలీసుల డిమాండ్

నీ కూతుర్ని వెతకాలంటే మా బండిలో డీజిల్ పోయించు…పోలీసుల డిమాండ్

Updated On : February 3, 2021 / 4:09 PM IST

Kanpur Woman Accuses Cops Of Not Finding Her Missing Daughter : కిడ్నాప్ కు గురైన తన కుమార్తెను వెతకటానికి పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఒక దివ్యాంగురాలైన   పేద మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. తన కూతుర్ని వెదకాలంటే పోలీసు వాహనాల్లో డీజిల్ పోయించమంటున్నారని ఆమె ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

కాన్పూర్  జిల్లాకు చెందిన దివ్యాంగురాలైన మహిళ నెల రోజుల క్రితం  తన కుమార్తెను తెలిసిన వ్యక్తి కిడ్నాప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.   అయితే బాలికను వెతకటంలో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని కాన్పూర్ పోలీసు కమీషనర్ కు ఆమె ఫిర్యాదు చేసింది.  అనంతరం బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడుతూ… తన బిడ్డను వెతికే విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,  తన కుమార్తెపై నిందలు వేస్తూ స్టేషన్ నుంచి   బయటకు గెంటేస్తున్నారని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.

పోలీసు  వాహానాల్లో డీజిల్ పోయించటానికి ఇప్పటికే బంధువుల వద్ద రూ.15వేలు దాకా అప్పుచేయాల్సి వచ్చిందని చెప్పారు.  తాను ఫిర్యాదు చేసిన పోలీసు స్టేషన్ లో ఒక్కరు  మాత్రమే తనకు సహకరిస్తున్నారని ఆమె తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్  మీడియాలో  వైరల్ అయ్యింది.

ఈ ఘటనపై  కాన్పూర్ సీనియర్ పోలీసు అధికారి బ్రజేష్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ……ఈకేసుపై   వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు స్టేషన్ ను ఆదేశించామని చెప్పారు.  ఆమె పోలీసులపై  చేసిన ఆరోపణలు వాస్తవమని తేలితే పోలీసులపై చర్యలు తప్పవని ఆయన అన్నారు.