వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించాలని భర్త వేధింపులు

వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించాలని భర్త వేధింపులు

Updated On : February 18, 2021 / 4:12 PM IST

wife request , protection from husband in kamareddy : కామారెడ్డి పట్టణంలో దారుణం జరిగింది. ఓ మహిళతో నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న ట్రావెల్స్ యజమాని కరోనా కష్టకాలంలో ఆర్ధికంగా చితికి పోవటంతో మహిళను వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించాలని వేధిస్తున్న ఘటన కామారెడ్డి లో చోటు చేసుకుంది.

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి లో నివాసం ఉండే బాలాజీ ట్రావెల్స్ యజమాని రమేష్, నందిని అనే మహిళతో నాలుగేళ్లుగా సహజీవనం  చేస్తున్నాడు. అతనికి అంతకు ముందే వివాహం అయి ఇద్దరు పిల్లలు ఉన్నా…. ఆవిషయం దాచిపెట్టి ఆమెతో సహజీవనం చేయసాగాడు.

నందిని వత్తిడి మేరకు ఆమెకు  తాళి కట్టాడు. ఇలా ఉండగా కరోనా కాలంలో ట్రావెల్స్ వ్యాపారం బాగా దెబ్బతిని ఆర్ధికంగా చితికిపోయాడు. దీంతో ఆమెను వ్యభిచారం చేసి డబ్బు సంపాదించి ఇవ్వాలని వత్తిడి చేయసాగాడు.  అందుకు ఆమె తిరస్కరించటంతో తీవ్రంగా కొట్టాడు. విటులను తానే మాట్లాడి ఇంటికి తీసుకువచ్చి వారితో సన్నిహితంగా గడపమని, లేకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు విలేకరులకు  చెప్పింది.

రమేష్ అరాచకాలపై రెండు నెలల క్రితమే ఒకసారి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె విలేకరులకు తెలిపింది. విటులను తీసుకువచ్చి వారితో గడపలేదని ఒకసారి తల పగలకొట్టాడని ఆమె చెప్పింది. తనకు రమేష్ నుంచి ప్రాణ హాని ఉందని..అతడ్ని శిక్షించాలని విలేకరులకు చెప్పుకుని భోరున విలపించింది.