Assembly Elections 2023: మూడు రాష్ట్రాల సంప్రదాయం ఎలా ఉంది? అదే జరిగితే కాంగ్రెస్, బీజేపీలో ఎవరికి లాభం?
ఈ మూడు రాష్ట్రాల్లోని ఓటర్ల సంప్రదాయం చూస్తూ ఆసక్తికర ఫలితాలు వస్తాయని కొందరు అంటున్నారు. ఒకవేళ అదే సంప్రదాయం కొనసాగించినట్లైతే ఏ పార్టీకి లాభం అవుతుంది? ఏ పార్టీకి నష్టం జరుగుతుందనే చర్చ ప్రస్తుతం విస్తృతంగా సాగుతోంది

హిందీ బెల్ట్ రాష్ట్రాలుగా చెప్పుకునే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మొదటి దశలో భాగంగా 20 స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ ముగిసింది. ఇక మరో 70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. ఇదే రోజున మధ్యప్రదేశ్ అసెంబ్లీలోని 230 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇక రాజస్థాన్ అసెంబ్లీలోని 200 స్థానాలకు ఒకే దశలో నవంబర్ 25న పోలింగ్ జరగనుంది. మిజోరాం, తెలంగాణ రాష్ట్రాలతో కలుపుకుని ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న విడుదల కానున్నాయి.
ఇక ఈ మూడు రాష్ట్రాల్లోని ఓటర్ల సంప్రదాయం చూస్తూ ఆసక్తికర ఫలితాలు వస్తాయని కొందరు అంటున్నారు. ఒకవేళ అదే సంప్రదాయం కొనసాగించినట్లైతే ఏ పార్టీకి లాభం అవుతుంది? ఏ పార్టీకి నష్టం జరుగుతుందనే చర్చ ప్రస్తుతం విస్తృతంగా సాగుతోంది. ఈ మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ లాంటివి కొన్ని ఉన్నప్పటికీ.. వాటి ప్రభావం ఆ రెండు పార్టీల మెజారిటీపై చూపకపోవచ్చనే అంచనాలు ముందు నుంచి వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: 10 రోజుల్లో ఎన్నికలు.. మెగా ప్లాన్ సిద్ధం చేసిన ప్రధాని మోదీ
ఛత్తీస్గఢ్
ఇక ఈ నేపథ్యంలో 2003లో ఛత్తీస్గఢ్ రాష్ట్ర అసెంబ్లీకి తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. అప్పటి నుంచి కమలం పార్టీదే హవా కొనసాగుతోంది. వరుసగా మూడుసార్లు కమలమే వికసించింది. ఆ పార్టీ నేత రమణ్ సింగ్ 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ దారుణ ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రజలు ఇలాగే తీర్పు చెబితే ఈసారి కూడా కాంగ్రెస్ ఘన విజయం సాధించేలానే కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఒపీనియన్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీకే విజయాన్ని కట్టబెట్టాయి.
మధ్యప్రదేశ్
భారతీయ జనతా పార్టీ మొదటిసారి అధికారం సాధించిన రాష్ట్రం మధ్యప్రదేశ్. బూత్ లెవెల్లో కార్యకర్తలు పటిష్టంగా ఉన్న రాష్ట్రం కూడా అదే. అందుకే దశాబ్దాలుగా ఆ రాష్ట్రంలో బీజేపీ చక్రం తిప్పుతోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గత 20 ఏళ్లుగా (మధ్యలో 2 ఏళ్లు ముఖ్యమంత్రిగా లేరు) ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెజారిటీ రాలేదు. నవంబర్ 17న జరగబోయే పోలింగులో ఎప్పటిలాగే ఓటర్లు కమల బలాన్ని చూపిస్తే కాంగ్రెస్ పార్టీకి మరోసారి భంగపాటు తప్పదు. కానీ అంచనాలు ఎటూ నిర్ణయించలేకుండా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: పొట్టోడే కానీ అహం మాత్రం చాలా పొడవు.. కేంద్రమంత్రిపై ప్రియాంక ఘాటు వ్యాఖ్యలు
రాజస్థాన్
చివరిగా రాజస్థాన్ పరిస్థితి చూస్తే.. ఇక్కడ ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారుతూ ఉంటుంది. అధికార మార్పిడి కాంగ్రెస్, బీజేపీల మధ్యే అయినా ప్రతి ఎన్నికలో మార్పు సహజమైంది. అదే లెక్కన పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అయితే రాజస్థాన్ ఓటర్లు తమ సంప్రదాయాన్ని కనబర్చినట్లైతే ఈసారి బీజేపీ వచ్చే అవకాశం ఉంది. పై మూడు రాష్ట్రాల్లో సంప్రదాయం అలాగే కొనసాగితే రెండు పెద్ద రాష్ట్రాల్లో అధికారం బీజేపీకే దక్కనుంది. అయితే అసలు ఫలితాలు డిసెంబర్ 3 వెలువడనున్నాయి.