రైతును రాజు చేసేంత వరకు విశ్రమించను..కేసీఆర్

  • Published By: chvmurthy ,Published On : March 16, 2020 / 11:27 AM IST
రైతును రాజు చేసేంత వరకు విశ్రమించను..కేసీఆర్

Updated On : March 16, 2020 / 11:27 AM IST

రాష్ట్రంలో రైతును రాజును చేసేంతవరకు, ఎంత పెట్టుబడి పెట్టేందుకైనా సిధ్దమేనని, సాగునీరు తెచ్చేంతవరకు విశ్రమించమని….సజల సృజల సస్యశ్యామల తెలంగాణ సాకారం చేసేంతవరకు  అవిశ్రాంతంగా పని చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. శాసన సభలో ఈరోజు ఆయన ద్రవ్య వినిమయ బిల్లుపై  జరిగిన చర్చలో మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి కళ్ళముందు కనిపిస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఏదో ఒక మారుమూల గ్రామానికి   నీళ్లు రాకుంటే మొత్తం భగీరధ దండుగ అన్నట్లు   విపక్షాలు మాట్లడటం సరికాదని ఆయన అన్నారు.

మిషన్  భగీరథ పథకం కింద రాష్ట్రంలో సుమారు 24వేల గ్రామాలకు నీళ్లిచ్చామని….మంచిని మంచి అనే సంస్కారం లేకుండా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని  కేసీఆర్ మండిపడ్డారు. అన్ని రంగాల్లో జరిగిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే కనిపిస్తోందన్నారు. రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి సైతం కొనియాడిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఏ ప్రభుత్వం కూడా మొత్తం చెడ్డ పనులు చేయదని.. చాలా వరకు మంచి పనులే చేస్తుందని  కేసీఆర్ చెప్పారు.

రాష్ట్రంలో జరిగిన అభివృధ్ది కాంగ్రెస్‌ నాయకులకు కనిపించడం లేదని.. అనేక రంగాల్లో తెలంగాణ దూసుకుపోతోందని కేసీఆర్ చెప్పారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌ వన్‌.కాగ్‌ ఇచ్చిన లెక్కలనే మేం శాసనసభలో సమర్పించాం. టీడీపీ, కాంగ్రెస్‌ హయాంలో పెన్షన్లది ఘోరమైన పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో పింఛన్‌ రూ.200 ఇచ్చేవారు. 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పింఛన్‌ రూ.వెయ్యి చేశాం. ప్రస్తుతం పింఛన్‌ వంద శాతం పెంచి రూ.2016 చేశాం.  రాష్ట్ర ఆర్థిక స్థితి బాగాలేకపోతే సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నాం. ఏ రాష్ట్రంలో లేని విధంగా బీడీ కార్మికులకు పింఛన్‌ ఇస్తున్నాం.  

తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.5లక్షల కోట్లలోపు ఉండేది. ప్రస్తుతం రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.9లక్షల కోట్లకు పైగా ఉంది. ప్రాజెక్టులకు డీపీఆర్‌ కావాలని విపక్షాలు అడుగుతున్నాయి. ప్రాజెక్టులకు బహిరంగంగా టెండర్లు పిలుస్తున్నామని సీఎం వివరించారు. 
 

ఐదేళ్లలో కేంద్రానికి పన్నుల రూపంలో రూ.2.70లక్షల కోట్లు చెల్లించామని.. కేంద్రం మాత్రం రూ.1.12లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని ఆక్షేపించారు. జాతి నిర్మాణంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని.. దేశాన్ని సాకే రాష్ట్రాల్లో ముందుంటోందని కేసీఆర్ వివరించారు.

వేసిన పంట పండుతుందా? పండదా అనే స్థితి నుంచి దర్జాగా పంటలు పండించుకునే స్థితికి రాష్ట్రం వచ్చిందా లేదా?ఇది వృద్ధి కాదా? కాంగ్రెస్ నేతలకు ఇది కనబడదా? ఎక్కడో పాతాళంలో ఉన్న తెలంగాణ..ప్రస్తుతం తలసరి ఆదాయంలో నంబర్ వన్, ఇది నిజంకాదా అని కేసీఆర్ ప్రశ్నించారు. 

 

530 టీఎంసీలు గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారా అందిస్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు  ఎన్నో కేసులు వేశారు. మిషన్‌ కాకతీయ చాలా వరకు పూర్తయింది. రెండేళ్లలో 1200 చెక్‌ డ్యాంలు పూర్తి చేయబోతున్నాం. వ్యవసాయ రంగం ద్వారా జీఎస్డీపీ పెంచే ప్రయత్నం చేస్తున్నామని కేసీఆర్ అన్నారు.