కేటీఆర్ జోస్యం : చంద్రబాబు రిటైర్మెంట్ ఖాయం

  • Published By: veegamteam ,Published On : April 4, 2019 / 04:23 PM IST
కేటీఆర్ జోస్యం : చంద్రబాబు రిటైర్మెంట్ ఖాయం

Updated On : April 4, 2019 / 4:23 PM IST

హైదరాబాద్ : ఏపీతో పాటు దేశ ఎన్నికలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దేశంలో సంకీర్ణం రాబోతుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. ఏపీలో ఎవరెన్ని సీట్లు గెలుస్తారో చెప్పలేమన్న ఆయన.. సీఎం చంద్రబాబుకు మాత్రం రిటైర్‌మెంట్ ఖాయమని స్పష్టం చేశారు. వారణాసికి మోడీ, మల్కాజ్‌గిరికి రేవంత్‌రెడ్డి ఏమైనా లోకలా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఉన్నంత బలంగా మరే పార్టీ లేదని, లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ మరింత పతనమవుతుందని కేటీఆర్ అన్నారు.

నిజామాబాద్‌లో కచ్చితంగా గెలుస్తామని, కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం మానేసి ఇళ్లకు పరిమితమవుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నామా నాగేశ్వరరావు కోసం తీవ్రంగా ప్రయత్నించిన కాంగ్రెస్ చివరకు రేణుకా చౌదరి పేరును జాబితాలో చేర్చిందన్నారు. టికెట్ ఇవ్వకుండా గొంతు కోశారని వివేక్ అనడం సరికాదని, పార్టీని అంటి పెట్టుకుని ఉంటే అవకాశాలు వస్తాయన్నారు. చేవెళ్ల ఒక మినీ ఇండియా అని, అక్కడ లోకల్, నాన్ లోకల్ అనేది వర్కవుట్ కాదని కేటీఆర్ అన్నారు.

అంబర్‌పేటలో కేటీఆర్ రోడ్‌షో నిర్వహించారు. సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి సాయికిరణ్‌యాదవ్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. ప్రధాని మోడీపై విమర్శలు సంధించారు. దేశంలో 2014లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. ఈ ఐదేళ్లలో మోడీ ఒక్క పని మాత్రం చేశారు.. మా ఆడబిడ్డలు పోపుల డబ్బాలో దాచుకున్న డబ్బులను మోడీ మాయం చేశారు.. మన పైసల కోసం బ్యాంకుల ముందు నిలబడేలా చేశారు.. అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సాయికిరణ్ యాదవ్ ను గెలిపించాలని కేటీఆర్ అభ్యర్థించారు.