తెలంగాణకు భారీ వర్ష సూచన : అరేబియా సముద్రంలో అల్పపీడనం

  • Published By: madhu ,Published On : October 21, 2019 / 03:11 AM IST
తెలంగాణకు భారీ వర్ష సూచన : అరేబియా సముద్రంలో అల్పపీడనం

Updated On : October 21, 2019 / 3:11 AM IST

తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం ముగిసినా..వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరో భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి విదర్భ వరకు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందన్నారు.

కోమోరిన్ ప్రాంతం నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందన్నారు. ఈ ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు తెలంగాణలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇదిలా ఉంటే..హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వరంగల్ అర్బన్ జిల్లా ఎలకతుర్దిలో 6.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గోవిందారావు పేటలో 5.5, మంకాల్‌లో 5.2, కోహెడలో 4.4, బండ్లగూడలో 4.2, కమలాపూర్‌లో 4.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

నగరాన్ని వరుణుడు వీడడం లేదు. భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2019 అక్టోబర్ 20వ తేదీ ఆదివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం పడింది. వర్షాకాలం ముగిసే సమయంలో వానలు పడుతుండడంతో జనజీవనం స్తంభిస్తోంది. చిన్నపాటి వర్షానికే చిత్తడి చిత్తడిగా మారే హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 
Read More : వెదర్ అప్ డేట్ : తెలంగాణలో 4 రోజులూ భారీ వర్షాలు