ఢిల్లీకి సీఎం కేసీఆర్ : 10 నెలల తర్వాత ప్రధాని మోడీతో భేటీ

  • Published By: veegamteam ,Published On : October 3, 2019 / 02:57 PM IST
ఢిల్లీకి సీఎం కేసీఆర్ : 10 నెలల తర్వాత ప్రధాని మోడీతో భేటీ

Updated On : October 3, 2019 / 2:57 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లారు. 10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం(అక్టోబర్ 4, 2019) ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో గోదావరి- కృష్ణా నదుల అనుసంధానంపైనే ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. శ్రీశైలానికి గోదావరి జలాల తరలింపుపై ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్‌ ఇప్పటికే రెండుసార్లు చర్చించారు.

ఈ బృహత్తర ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకు ఎంతో మేలు చేస్తుందని, దీనికి కేంద్ర సహకారం అవసరమని కేసీఆర్‌ ప్రధానికి వివరించే అవకాశం ఉంది. నదీజలాలతో పాటు దేశంలోని ఆనకట్టలన్నీ కేంద్రం పరిధిలోకి వస్తాయి. కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఈ క్రమంలో మోడీ సహకారం కోరేందుకు కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.

మోడీని కేసీఆర్‌ 2018 డిసెంబరులో చివరి సారిగా కలిశారు. మోడీ రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు కలువలేదు. నీతి ఆయోగ్‌ ఏర్పాటు చేసిన సీఎంల సమావేశానికి, నక్సల్‌ సమస్యపై హోంమంత్రి అమిత్‌ షా ఏర్పాటు చేసిన సమావేశానికీ కేసీఆర్‌ వెళ్లలేదు. రాష్ట్రంలో బీజేపీ- టీఆర్‌ఎస్‌ ఉప్పు-నిప్పుగా మారిన దశలో పది నెలల తర్వాత  కేసీఆర్‌ ప్రధాని మోడీని కలుస్తుండడంతో వీరి భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.