ఫ్రంట్‌లో ఫ్యాన్ : ఇక్కడ భేటీ అక్కడ మంటలు

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ – టీఆర్ఎస్ కలయికపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జగన్ – కేటీఆర్‌లు భేటీ కావడంపై విరుచుకుపడ్డారు. అది ఫెడరల్ ఫ్రంట్ కాదని.. మోడీ ఫ్రంట్ అని మంత్రి దేవినేని ఉమ విరుచుకుపడ్డారు. ఏపీ ప్రజల్ని తిట్టిపోసిన కేసీఆర్ మాటల్ని ఎప్పటికీ మరిచిపోరని.. అటువంటి కేసీఆర్‌తో జగన్ ఏపీ ప్రజల్ని అవమానించడమేనని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ – టీఆర్ఎస్‌లు ఇప్పుడు కలవడమేంటని.. ఎప్పుట్నుంచో కలిసి పనిచేస్తున్నారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఎవరు ఎంతమంది కలిసినా టీడీపీని ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. ఏపీకి కేసీఆర్ వస్తే డబుల్ గిఫ్టులిస్తామని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మోడీకి అనుకూలంగా కేసీఆర్ పనిచేస్తున్నారని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు. మోడీ డైరెక్షన్‌లో కేసీఆర్.. కేసీఆర్ డైరెక్షన్‌లో జగన్ నడుచుకుంటున్నారని.. కేసీఆర్‌తో కలిస్తే జగన్ పాతాళానికి పోతారని వ్యాఖ్యానించారు.