ఏపీలో పొలిటికల్ హీట్ : కేటీఆర్ – జగన్ భేటీ

  • Published By: madhu ,Published On : January 16, 2019 / 07:52 AM IST
ఏపీలో పొలిటికల్ హీట్ : కేటీఆర్ – జగన్ భేటీ

హైదరాబాద్ : ఒక్క భేటీ…రాజకీయాల్లో దుమారం రేపుతోంది…ఏపీ రాష్ట్రంలో రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. ఈ సమావేశంతో రాజకీయాల్లో ఏమి జరుగుతోంది ? ఇలా..ఎన్నో అంశాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో డైనమిక్ లీడర్‌గా పేరు గడించిన కేటీఆర్…ఏపీ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్‌‌‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2019, జనవరి 16వ తేదీన లోటస్ పాండ్‌లో జరుగుతున్న ఈ భేటీలో కేవలం ఫెడరల్ ఫ్రంట్‌పైనే నేతలు చర్చిస్తున్నారని తెలుస్తోంది. వీరిద్దరూ కలవడంపై నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది స్వాగతిస్తుండగా..మరికొంత మంది నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ భేటీ వెనుక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హస్తం ఉందని..ఇదొక కుట్ర దాగి ఉందని ఏపీ టీడీపీ విమర్శిస్తోంది. 
దేశంలో గుణాత్మక మార్పు కోసం…
దేశంలో గుణాత్మక మార్పు కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. నాన్ కాంగ్రెస్ – నాన్ బీజేపీ పరిపాలన రావాలని..అందులో భాగంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా ప్రయత్నిస్తానని చెప్పిన గులాబీ బాస్ అందుకనుగుణంగా చర్చలు ప్రారంభించారు. ఇప్పటికే పలువురు జాతీయ నేతలతో కలిశారు. తాజాగా ఏపీలోని వైెఎస్ఆర్ కాంగ్రెస్‌తో చర్చలు జరపాలని ఆదేశాలతో కేటీఆర్ బృందం జగన్‌తో భేటీ అయ్యింది.
కేటీఆర్ బృందంలో సీనియర్ ఎంపీ వినోద్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డిలున్నారు.
జగన్ బృందంలో విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్థసారధి, ప్రభాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలున్నారు. 
ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ సహకారం ? 
కేటీఆర్ – జగన్‌లు జరుపుతున్న ఈ భేటీ కేవలం ఫెడరల్ ఫ్రంట్ వరకే పరిమితమౌతుందా ? లేక అక్కడి రాజకీయాల్లో టీఆర్ఎస్ సహకారం అందిస్తుందా అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. అవసరమైతే ఏపీ రాజకీయాల్లో వేలు పెడుతామంటూ ఇటీవలే కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ భేటీ అనంతరం జగన్ – కేటీఆర్‌లు ఎలాంటి ప్రకటన చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.