India Pakistan War: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల వేళ.. భారత్ పై బంగ్లాదేశ్ రిటైర్డ్ మేజర్ జనరల్ వివాదాస్పద వ్యాఖ్యలు..
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో బంగ్లాదేశ్ రిటైర్డ్ మేజర్ జనరల్ ఏఎల్ఎం ఫజుల్ రెహమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Bangladesh retired Major General Fazul Rahman
India Pakistan War: పహల్గాం ఉగ్రదాడి తరువాత భారతదేశం, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలు సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించాయి. దీంతో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇండియన్ మిలిటరీ స్ట్రైక్స్ భయంతో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని వెయ్యి వరకు మదర్సాలను మూసేశారు. ఈ ప్రాంతంలోని అన్ని మతపరమైన విద్యా సంస్థలను పదిరోజుల పాటు క్లోజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. తమపై త్వరలో భారత్ సైనిక చర్యను ప్రారంభించాలని చూస్తుందని ఆ దేశం మిలిటరీ హడాలిపోతుంది.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో బంగ్లాదేశ్ రిటైర్డ్ మేజర్ జనరల్ ఏఎల్ఎం ఫజుల్ రెహమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశం పాకిస్థాన్ పై దాడిచేస్తే భారతదేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ ఆక్రమించుకోవాలని అన్నారు. ఇందుకు చైనా సహకారం తీసుకోవాలని, చైనాతో కలిసి ఒక ఉమ్మడి సైనిక వ్యవస్థను ఏర్పాటుచేసే దిశగా చర్చించడం అత్యవసరమని చెప్పారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో బెంగాలీ భాషలో ఫజుల్ రెహమాన్ పోస్టు పెట్టాడు.
Also Read: Baba Vanga Prediction: ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుందా? వంగ బాబా జోస్యం ఏం చెబుతోంది..
బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహ్మద్ యూనస్ కు సన్నిహితుడిగా ఫజుల్ రెహమాన్ కు పేరుంది. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, పాకిస్థాన్ విమానాలకు భారత గగనతలాన్ని మూసివేయడం, పాక్ జాతీయులకు వీసాల రద్దు వంటి చర్యల నేపథ్యంలో రెహమాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, రెహమాన్ చేసిన వ్యాఖ్యలు భారత్ – బంగ్లాదేశ్ మధ్య సున్నితమైన సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.