Act Of War: భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు..! సైన్యానికి సెలవులు రద్దు..

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. భారత్ వార్నింగ్ తో పాకిస్తాన్ అప్రమత్తమైంది.

Act Of War: భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు..! సైన్యానికి సెలవులు రద్దు..

Updated On : April 24, 2025 / 8:45 PM IST

Act Of War: భారత్ యాక్షన్ తో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రతీకార చర్యలకు పూనుకుంటోంది. సింధు జలాలను ఆపడం అంటే యుద్ధం ప్రకటించడమే అంటోంది. ఈ క్రమంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత విమానాలకు పాకిస్తాన్ గగనతలం మూసివేసింది. భారత్ తో వ్యాసార సంబంధాలకు తెగదెంపులు చెప్పింది. సైనికులకు సెలవులు రద్దు చేసిన పాకిస్తాన్.. భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని ఆదేశించింది.

సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారతదేశం నిర్ణయించిన ఒక రోజు తర్వాత, పాకిస్తాన్ ప్రధాన మంత్రి కార్యాలయం అటువంటి ప్రయత్నం ఏదైనా “యుద్ధ చర్య”గా పరిగణించబడుతుందని తెలిపింది. అంతేకాదు పాక్ ప్రతీకార చర్యలకు దిగింది. భారత్ కు తన గగనతలాన్ని మూసివేసింది. ఇండియాతో అన్ని వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

గురువారం ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన అత్యున్నత పౌర, సైనిక నాయకత్వంతో కూడిన పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ సమావేశాన్ని నిర్వహించింది.

భారత్, పాక్ మధ్య పరిష్కారం కాని వివాదంగా కశ్మీర్ మిగిలిపోయిందని కమిటీ గమనించింది. కశ్మీరీలకు స్వయం నిర్ణయాధికార హక్కు ఉందని తన వైఖరిని పునరుద్ఘాటించింది. ఉగ్రవాద దాడిని “నిస్సందేహంగా” ఖండిస్తూ, పాకిస్తాన్ ప్రధాన మంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది. “విశ్వసనీయ దర్యాప్తు, ధృవీకరించదగిన ఆధారాలు లేనప్పుడు, పహల్గామ్ దాడిని పాకిస్తాన్‌తో అనుసంధానించే ప్రయత్నాలు పనికిమాలినవి, హేతుబద్ధత లేనివి.”

Also Read: భారత్-పాకిస్థాన్ మధ్య హైటెన్షన్.. పాక్ బందీగా భారత్ జవాన్.. ఏం జరగనుంది..

సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయాలన్న భారత ప్రకటనను కమిటీ “తీవ్రంగా తిరస్కరించాలని” నిర్ణయించింది. “ఈ ఒప్పందం ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించిన ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఏకపక్షంగా నిలిపివేయడానికి ఎటువంటి నిబంధన లేదు. ఆ నీరు పాకిస్తాన్ కు అత్యంత ముఖ్యం. 240 మిలియన్ల ప్రజలకు జీవనాడి. సింధు జలాల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌కు చెందిన నీటి ప్రవాహాన్ని ఆపడానికి లేదా మళ్లించడానికి చేసే ఏ ప్రయత్నం అయినా, దిగువ నదీ తీరప్రాంత హక్కులను ఆక్రమించడం యుద్ధ చర్యగా పరిగణించబడుతుంది” అని ఒక ప్రకటనలో పేర్కొంది.

భారత్ చర్యలకు ప్రతీకారంగా.. పాకిస్తాన్ భారత్ తో సిమ్లా ఒప్పందంతో సహా అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలుపుదల చేయాలని నిర్ణయించింది. తక్షణమే వాఘా సరిహద్దు పోస్ట్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

భారతదేశం యాజమాన్యంలోని లేదా భారతదేశం నడుపుతున్న అన్ని విమానయాన సంస్థలకు పాకిస్తాన్ గగనతలాన్ని తక్షణమే మూసివేస్తున్నట్లు పేర్కొంది.

 

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here