Republic Day: భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ ఏడు రోజుల ‘ఆపరేషన్ అలెర్ట్’

Republic Day: భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ ఏడు రోజుల ‘ఆపరేషన్ అలెర్ట్’

Updated On : January 22, 2023 / 4:42 PM IST

Republic Day: భారత గణతంత్ర దినోత్సవ వేళ పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దుందుడుకు చర్యలకు దిగే ముప్పు ఉండడంతో వారి ఆటలు కట్టించడానికి భద్రతా బలగాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ ఏడు రోజుల ‘ఆపరేషన్ అలెర్ట్’ను ప్రారంభించింది.

గుజరాత్ లోని సిర్ క్రిక్ నుంచి రాన్ ఆఫ్ కచ్, అలాగే, రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ‘ఆపరేషన్ అలెర్ట్’లో పాల్గొంటున్నారు. నిన్న ప్రారంభమైన ‘ఆపరేషన్ అలెర్ట్’ ఈ నెల 28 వరకు కొనసాగుతుందని అధికారులు చెప్పారు. ఇందులో భాగంగా లోతైన ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తారని తెలిపారు.

నిన్న ఉదయం జమ్మూలోని నార్వాల్ ప్రాంతంలో రెండు బాంబు పేలుళ్ల ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భారత గణతంత్ర దినోత్సవ వేళ ఈ దాడులు జరగడం కలకలం రేపుతోంది. దీంతో జమ్మూకశ్మీర్ లో భారత ఆర్మీ భద్రతను కట్టుదిట్టం చేసింది. జమ్మూకశ్మీర్ లోని అన్ని ప్రాంతాల్లోనూ ఆర్మీని మోహరించినట్లు అధికారులు తెలిపారు.

కాగా, ఈ సారి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్ సిసి వస్తున్న విషయం తెలిసిందే. కాగా, గురువారం గణతంత్ర వేడుకలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లోనూ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Hyderabad: హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం.. సిలిండర్లు పేలి అంటుకున్న మంటలు