బీజేపీలో Anti CAA ట్రెండ్ : 80 మంది ముస్లీం నాయకులు రాజీనామా

  • Published By: vamsi ,Published On : January 24, 2020 / 04:00 PM IST
బీజేపీలో Anti CAA ట్రెండ్ : 80 మంది ముస్లీం నాయకులు రాజీనామా

CAA

Updated On : January 24, 2020 / 4:00 PM IST

కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) సెగలు దేశవ్యాప్తంగా ప్రకంపణలు సృష్టిస్తూనే ఉన్నాయి. బీజేపీకి ప్రతి రాష్ట్రంలోనూ వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా మధ్యప్రదేశ్‌లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ ఎదురైంది. మధ్యప్రదేశ్‌కు చెందిన 80 మంది బీజేపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేశారు.  సీఏఏకు వ్యతిరేకంగా వీరంతా రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ నూతన అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖలు రాశారు.

అనంతరం మాట్లాడిన వారు.. మత ప్రాతిపదికన ప్రజలను విభజించేందుకే సీఏఏను తీసుకొచ్చారని ఆరోపించారు. సీఏఏ ఇప్పటికే అమల్లోకి రావడంతో తమ మతానికి చెందిన కార్యక్రమాల్లో పాల్గొనడం కష్టంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఏఏ లాంటి విభజన చట్టాలపై ఇంకా ఎంతకాలం మౌనంగా ఉండాలని ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారని వారికి సమాధానం చెప్పలేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

శరణార్థులు ఏ మతం వారైనా భారత పౌరసత్వం ఇవ్వాల్సిందేనని, కానీ మతం ఆధారంగా వారు ఉగ్రవాదులా? చొరబాటుదారులా? అనేది ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. పార్టీకి రాజీనామా చేసిన వారిలో బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గీయకు అత్యంత సన్నిహితంగా ఉండే నేతలు కూడా ఉన్నారు.