భారత్‌లో కరోనా ఉగ్రరూపం, ఒక్కరోజే 23వేల కేసులు, 442 మరణాలు, తమిళనాడులో లక్ష దాటాయి

  • Published By: naveen ,Published On : July 4, 2020 / 10:45 AM IST
భారత్‌లో కరోనా ఉగ్రరూపం, ఒక్కరోజే 23వేల కేసులు, 442 మరణాలు, తమిళనాడులో లక్ష దాటాయి

Updated On : July 4, 2020 / 1:02 PM IST

దేశంలో క‌రోనా వైర‌స్ ఉగ్రరూపం దాల్చింది. రోజూ రికార్డు స్థాయిలో 20వేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కరోనా కేసుల్లో కొత్త రికార్డు నమోదైంది. గ‌డిచిన 24గంట‌ల్లో 22వేల 771 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా బాధితుల సంఖ్య 6లక్షల 48వేల 315కు చేరింది. నిన్న(జూలై 3,2020) ఒక్క‌రోజే 442మంది చనిపోయారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 18వేల 655కి పెరిగింది. ఇప్పటివరకు దేశంలో 3లక్షల 94వేల 227 మంది కోలుకోగా 2లక్షల 35వేల 433మంది చికిత్స పొందుతున్నారు. శుక్రవారం(జూలై 3,2020) ఒక్క‌రోజే దాదాపు 14వేల మంది కోలుకున్నారని ప్ర‌భుత్వం తెలిపింది. దేశంలో క‌రోనా బాధితుల రిక‌వ‌రీ రేటు 60శాతం దాట‌డం కాస్త ఊర‌ట క‌లిగించే విష‌యం.

corona

ల‌క్ష కేసులు దాటిన రెండో రాష్ట్రం తమిళనాడు:
దేశంలో అత్య‌ధికంగా మ‌హారాష్ట్రలో క‌రోనా వైర‌స్ మ‌హమ్మారి విల‌య‌తాండ‌వం చేస్తున్న విష‌యం తెలిసిందే. నిత్యం రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు న‌మోదవుతున్నాయి. గ‌త రెండురోజులుగా రాష్ట్రంలో 6వేల‌కు పైగా పాజిటివ్ కేసులు బయటపడటం ప‌రిస్థితి తీవ్రతకు అద్దం ప‌డుతోంది. నిన్న ఒక్క‌రోజే మ‌హారాష్ట్రలో 6వేల పాజిటివ్ కేసులు రికార్డు కాగా మొత్తం కేసుల సంఖ్య లక్షా 92వేల 990కు చేరింది. వీరిలో ఇప్ప‌టి వ‌ర‌కు 8వేల 376 మంది కన్నుమూశారు. ఇక త‌మిళ‌నాడులోనూ నిత్యం 4వేల‌కుపైగా కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 4వేల 329 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య ల‌క్షా 2వేల‌కు చేరింది. దేశంలో ల‌క్ష కేసులు దాటిన రెండో రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 1,385మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలోనూ క‌రోనా కేసుల సంఖ్య ల‌క్ష‌కు చేరువైంది. తెలంగాణ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లోనూ క‌రోనా కేసులు ఒక్క‌సారిగా పెరిగాయి.

95ల‌క్ష‌లు దాటిన కరోనా ప‌రీక్ష‌ల సంఖ్య:
దేశంలో క‌రోనా వైర‌స్ తీవ్ర‌త పెరుగుతున్న దృష్ట్యా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల సంఖ్యను ప్ర‌భుత్వం పెంచింది. జులై 3 ఒక్క‌రోజే దేశ‌వ్యాప్తంగా 2లక్షల 42వేల 383 ప‌రీక్ష‌లు జ‌రిపిన‌ట్లు భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి(ఐసీఎంఆర్‌) వెల్ల‌డించింది. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో 95లక్షల 40వేల 132 శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్లు వెల్లడించింది. దేశంలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అన్ లాక్ తర్వాత ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగాయి. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ మాత్రం విజృంభిస్తూనే ఉంది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటే, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ కరోనా కట్టడికి సహకరించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.

Read:కరోనాతో చనిపోతే..వారిలో వైరస్ ఎంత సేపు ఉంటుందో తెలుసా