విపక్షాల తీవ్ర విమర్శలు…కశ్మీర్ లో కొనసాగుతున్న ఈయూ ఎంపీల పర్యటన

  • Published By: venkaiahnaidu ,Published On : October 30, 2019 / 03:04 AM IST
విపక్షాల తీవ్ర విమర్శలు…కశ్మీర్ లో కొనసాగుతున్న ఈయూ ఎంపీల పర్యటన

జమ్మూకశ్మీర్ లో యూరోపియన్ యూనియన్(EU)మంది ఎంపీల బృందం పర్యటన కొనసాగుతోంది. మొత్తం 27మంది ఎంపీలు పర్యటించాల్సి ఉండగా,నలుగురు సభ్యులు తప్పుకోవడంతో 23మంది ఎంపీల బృందం మంగళవారం శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో పర్యటించింది. శ్రీనగర్ లోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్ దాల్ లేక్ లో ఎంపీలు పర్యటించారు. ఈ ఎంపీలు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, పోలెండ్‌కు చెందిన వారు. ఇది అధికారిక పర్యటన కాదని, వ్యక్తిగత హోదాలో వీరు పర్యటిస్తున్నారని చెబుతున్నారు. వీరిలో ఎక్కువమంది ఎంపీలు మితవాద ధోరణి ఉన్నవారని, ఈ పర్యటనలో భారత్ ఎన్ఎస్ఏ కార్యాలయానికి కూడా కీలక పాత్ర ఉందని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు.

మంగళవారం ఈయూ ఎంపీలను ఆర్మీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ వారికి భద్రతా పరిస్థితి గురించి అధికారులు వివరించారు. ఈయూ ఎంపీల బృందం బీజేపీ నాయకులను కూడా కలిశారు. ప్రజలు శాంతి కోసం ఆరాటపడుతున్నారని, అయితే ఉగ్రవాదులు నిరంతరం బెదిరిస్తూనే ఉన్నారని ఉన్నత పోలీసులు, పౌర అధికారులు ఈయూ సభ్యులకు చెప్పారు. పోలీసు చీఫ్ దిల్బాగ్ సింగ్…గత 84 రోజులలో కశ్మీర్ లో ఒక్క ప్రాణాన్ని కూడా కోల్పోలేదని చెప్పినట్లు పీటీఐ తెలిపింది. కానీ ఉగ్రవాదులు ప్రజలను బెదిరించే 98 సంఘటనలు జరిగాయి. 350 కన్నా ఎక్కువ సార్లు పోస్టర్ల ద్వారా ఉగ్రవాదులు ప్రజలను బెదిరించారని అధికారులు తెలిపారు. ప్రముఖ పౌర సమాజ సమూహం, వాణిజ్య సంస్థ లేదా ప్రధాన స్రవంతి కాశ్మీరీ రాజకీయ పార్టీల నాయకులను ప్రతినిధి బృందం కలవలేవని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అయితే ఈయూ ఎంపీల కశ్మీర్ పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కశ్మీర్‌లో పర్యటించేందుకు భారతీయులకు అనమతి ఇవ్వకుండా విదేశీ ఎంపీలకు రెడ్ కార్పెట్ వేయడం ఏంటని ప్రశ్నించాయి. ఇంతకు ముందు, కశ్మీర్ వెళ్లాలన్న అమెరికా సెనేటర్ క్రిస్ వాన్ హాలెన్‌ అభ్యర్థనను భారత్ తోసిపుచ్చింది. భారత నేతలు, ఎంపీలు కశ్మీర్ వెళ్లకుండా నిషేధించిన ప్రభుత్వం, విదేశీ ఎంపీలను మాత్రం అక్కడికి వెళ్లనిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. భారత ఎంపీలు వెళ్లకుండా నిషేధం ఉన్నప్పుడు, జమ్ము-కశ్మీర్లో ఒక నిర్దేశిత పర్యటనకు యూరప్ ఎంపీలకు మాత్రం స్వాగతం పలుకుతున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరు భారత పార్లమెంట్‌ను, ప్రజాస్వామ్యాన్ని అవమానించే విధంగా ఉందని విమర్శించారు. 

జమ్మూ కశ్మీర్ పర్యటనకు బయల్దేరిన రాహుల్ గాంధీని ఆగస్టు 25న శ్రీనగర్ ఎయిర్ పోర్టులో అడ్డుకుని కశ్మీర్ లో పర్యటించకుండా తిరిగి ఢిల్లీ పంపించిన విషయం తెలిసిందే. అనంతరం కశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్‌ను కూడా జమ్మూ కశ్మీర్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఈ విషయమై  రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారతీయులకు లేని హక్కులు యురోపియన్ యూనియన్ ఎంపీలకు ఉండడమేంటి? దేశానికి తెలియకుండా ఏదో జరుగుతోందని ట్వీట్ లో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ తీరు భారత పార్లమెంట్‌ను, ప్రజాస్వామ్యాన్ని అవమానించే విధంగా ఉందని విమర్శించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ..జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం రాష్ట్రంలో పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు యురోపియన్ యూనియన్ ఎంపీలకు అనుమతి ఇవ్వడ మంచి పరిణామమే. అయితే భారతీయులకు కశ్మీర్‌ను సందర్శించే అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరం. విపక్ష పార్టీల నేతలకు కశ్మీర్‌లో పర్యటించే అవకాశం కల్పించాలి. కశ్మీర్ పరిస్థితులు ఏంటనేది భారతీయులకు తెలియాలి అని ట్వీట్ చేశారు. ప్రముఖ పౌర సమాజ సమూహం, వాణిజ్య సంస్థ లేదా ప్రధాన స్రవంతి కాశ్మీరీ రాజకీయ పార్టీల నాయకులను ప్రతినిధి బృందం కలవలేవని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈయూ నుంచి అనధికార పర్యటన కోసం వచ్చిన ఎంపీల బృందం పర్యటనను వెంటనే రద్దు చేయాలని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కూడా డిమాండ్ చేశారు. యూరోపిన్ యూనియన్‌కు సంబంధించిన నేతలను జమ్ము-కశ్మీర్ పర్యటనకు పంపించే ఏర్పాట్లను విదేశాంగ శాఖ వ్యక్తిగత స్థాయిలో చేయడం చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇది మన జాతీయ విధానానికి వ్యతిరేకం. ఇది అనైతికం, దీనిని వెంటనే రద్దు చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా అంటూ ఆయన ట్వీట్ చేశారు. జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రెటిక్ పార్టీ నేత మహబూబా ముఫ్తీ ఇదే అంశంపై సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అక్టోబర్ 31న జమ్ము-కశ్మీర్‌ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారనుంది. జమ్ము-కశ్మీర్, లడఖ్ గా విడిపోతుంది. ఈలోపు యూరోపియన్ యూనియన్ బృందం ఈ పర్యటనను కీలకంగా భావిస్తున్నారు. కానీ సామాన్యుల మనసులో మాటను ప్రతినిధి బృందం తెలుసుకోగలదా అని చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు.