కాలనీలోని వారికి విపరీతంగా వస్తున్న డెలివరీ ఆర్డర్లను తట్టుకోలేక ఈ సొసైటీ అధ్యక్షుడు ఎలాంటి నోటీసు ఇచ్చారంటే?

ఎఫ్ బ్లాక్‌లో నివసిస్తున్న బ్యాచిలర్‌లకు రోజూ 10-15 డెలివరీలు వస్తున్నాయని..

కాలనీలోని వారికి విపరీతంగా వస్తున్న డెలివరీ ఆర్డర్లను తట్టుకోలేక ఈ సొసైటీ అధ్యక్షుడు ఎలాంటి నోటీసు ఇచ్చారంటే?

Updated On : September 20, 2024 / 4:04 PM IST

ఆన్‌లైన్‌లో వస్తువులను ఆర్డర్లు ఇచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. దీంతో హౌసింగ్ సొసైటీలు, కాలనీల్లో సెక్యూరిటీ గార్డులు వాటి వల్ల తిప్పలు పడుతున్నారు. డెలివరీ ఆర్డర్లు ఒక్కదాని వెనుక ఒకటి వస్తుండడంతో వాటిని చాలా ప్రాంతాల్లో మొదట వాచ్‌మన్లు తీసుకుని, ఆ తర్వాత వాటిని ఆర్డర్లు చేసిన వారికి ఇస్తున్నారు. ఏ ఇళ్లు ఎక్కడ ఉందో వాచ్‌మన్లు చెప్పాల్సి ఉంటుంది.

డెలివరీ ఆర్డర్లు తీసుకుని వచ్చే డెలివరీ బాయ్స్‌కు వాచ్‌మన్లు ఓటీపీల వంటివి కూడా చెప్పాల్సి వస్తోంది. ఈ సమస్యపై ఓ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు కాలనీ వాసులకు ఇచ్చిన నోటీసు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ నోటీసుకు సంబంధించిన వివరాలను ఎక్స్ యూజర్ షాజన్ ట్వీట్ చేశాడు.

ఆ నోటీసులోని వివరాల ప్రకారం.. హౌసింగ్‌ సొసైటీలో ఓ వ్యక్తి ఏడేళ్లుగా వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడని, అతడి బాధ్యతల నిర్వహణలో ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ సొసైటీ అధ్యక్షుడు తెలిపారు. ప్రతిరోజు అనేక పార్సిళ్లు వస్తుండడంతో వాటిని అతడు మేనేజ్ చేయలేకపోతున్నాడని చెప్పారు.

ఎఫ్ బ్లాక్‌లో నివసిస్తున్న బ్యాచిలర్‌లకు రోజూ 10-15 డెలివరీలు వస్తున్నాయని తెలిపారు. దీంతో ప్రతి ఒక్కరూ తమ ఆర్డర్‌లను రోజుకు 1-2 కంటే ఎక్కువ చేయకూడదని ఆయన కోరారు. లేదంటే, సొసైటీ వద్దకు వచ్చే డెలివరీ బాయ్‌లతో సమన్వయం చేసుకోవడానికి సొంతంగా వాచ్‌మన్‌ను నియమించుకోవాలని చెప్పారు. సొంతంగా వాచ్‌మన్‌ను నియమించుకోవాలని ఆ సొసైటీ అధ్యక్షుడు చేసిన సూచనకు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.

తిరుమల లడ్డూ వివాదంపై ప్రెస్‌మీట్‌లో వైఎస్ జగన్ సంచలన కామెంట్స్