దేశవ్యాప్తంగా విరబూస్తున్న కమలాలు…శివరాజ్ సర్కార్ సేఫ్!

దేశవ్యాప్తంగా కమలాలు విరబూస్తున్నాయి. బీహార్ లో ఎన్డీయూ కూటమి విజయం దిశగా దూసుకుపోతోంది. ఎన్డీయే కూటమిలోని జేడీ(యూ) కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తున్నాయి. తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా కమలం జోరు కొనసాగుతోంది. ఇక మధ్యప్రదేశ్ లోనూ అదే ట్రెండ్ కొనసాగుతుంది. మధ్యప్రదేశ్ లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది.
కాగా, ఇప్పటివరకు మధ్యప్రదేశ్ లో 1 స్థానంలో విజయం సాధించి 19 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం 7స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీఎస్పీ ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నది.
అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 107, కాంగ్రెస్ కు 87 మంది ఎమ్మెల్యేలున్నారు. సాధారణ ఆధిక్యాన్ని చేరుకోవడానికి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీకి మరో 8 సీట్లు కావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తే అదేమంత పెద్దగా కష్టమనిపించడం లేదు.
https://10tv.in/bihar-assembly-election-result-2020-ec-says-counting-to-continue-till-late-evening/
కాగా,ఈ ఏడాది మార్చిలో కమల్ నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని నిట్టనిలువునా కూల్చిన జ్యోతిరాధిత్య సింధియా.. 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.