ఎటీఎమ్‌ని పగలగొట్టలేక కారుకు కట్టుకుని లాక్కెళ్లిన దొంగలు

మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో ఎస్‌బీఐ ఏటీఎమ్‌ను పగలగొట్టలేక దొంగలు ఏటీఎమ్‌నే కారుకు కట్టుకుని లాక్కుని పారిపోయారు. ఏటీఎమ్ లోపల రూ .29.55 లక్షలు ఉండగా.. శుక్రవారం(27 సెప్టెంబర్ 2019) తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఒంటి గంట 47నిమిషాల నుంచి 2గంటల 8నిమిషాల సాత్నా జిల్లాలోని అమర్‌పాటన్ పట్టణంలో ఘటన జరిగినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులకు లభించిన ఏకైక క్లూ మాత్రం.. ఏటీఎమ్ కు సమీపంలోని దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ద్వారా వచ్చిన ఫుటేజ్.
ఏటీఎమ్‌ను దుండగులు బొలెరో కారుకు కట్టివేసి తీసుకెళ్లినట్లుగా ఆ ఫుటేజీలో రికార్డు అయ్యింది. ఎటీఎమ్ లోపల ఉన్న సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు సరిగ్గా రికార్డ్ చేయకుండా ఓ స్ప్రేని లోపలి కెమెరాలకు కొట్టారు దుండగులు. మిస్సైన ఎటీఎమ్ మిషన్ తెల్లవారుజామున 1.47 వరకు పనిచేయగా ఆ తర్వాత పనిచేయట్లేదని అధికారులు చెబుతున్నారు. అందులో రూ .29.55 లక్షల నగదు ఉన్నట్లుగా బ్యాంకు అధికారులు వెల్లడించారు. ఈ చోరీలో ఎంతమంది దుండగులు పాల్గొన్నారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదని పోలీసులు చెబుతున్నారు.
ఏటీఎమ్‌కు కొంత దూరంలో ఉన్న ఓ షాపు సెక్యురిటీ గార్డు.. వీరిని గమనించినట్లుగా తెలుస్తుంది. అయితే అతను పోలీసులకు ఫోన్ చేసి వాళ్లు వచ్చేలోపే దుండగులు పాచిపోయారు. అయితే ఇప్పటివరకు ఎటీఎమ్‌లను పగలుగొట్టిన సంఘటనలు చూసి ఉంటాం కానీ, ఎటీఎమ్‌నే ఎత్తుకెళ్లడం మాత్రం ఇదే తొలిసారి అని పోలీసులు చెబుతున్నారు. ఎటీఎమ్‌కు వాహనానికి ఉక్కు గొలుసులను కట్టి ఎటీఎమ్‌ను వేరుచేసి తీసుకుని వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన గురించి విచారణ చేపట్టినట్లుగా పోలీసులు చెబుతున్నారు.