Corona Cases India : భారత్ లో కరోనా మహా ప్రళయం ..ఒక్కరోజులోనే 3 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు
భారత్‌ను కరోనా మహాప్రళయం ముంచేస్తోంది. వైరస్ ఉప్పెన దాటికి ఇండియా కకావికలమవుతోంది. ప్రపంచంలో మరే దేశంలో మునుపెన్నడూ లేని విధంగా భారత్‌లో కరోనా కేసులు రికార్డయ్యాయి.

More Than 3 Lakh Corona Positive Cases In A Single Day In India
corona cases in India : భారత్‌ను కరోనా మహాప్రళయం ముంచేస్తోంది. వైరస్ ఉప్పెన దాటికి ఇండియా కకావికలమవుతోంది. ప్రపంచంలో మరే దేశంలో మునుపెన్నడూ లేని విధంగా భారత్‌లో కరోనా కేసులు రికార్డయ్యాయి. ఒక్కరోజులోనే దాదాపు 3 లక్షల 17 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా అమెరికా తప్ప మరే దేశంలోనూ ఒక్క రోజులు 3 లక్షల కేసులు రికార్డుకాలేదు. గత జనవరి 8న అమెరికాలో నమోదైన 3 లక్షల 7 వేల కేసుల రికార్డును భారత్ బద్దలుకొట్టింది. దేశంలో నిమిషానికి 220 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
అటు మరణాల సంఖ్య నానాటికి విపరీతంగా పెరిగిపోతోంది. వరుసగా రెండో రోజు కూడా మరణాల సంఖ్య 2 వేలు దాటింది. ఒక్క రోజులోనే 2 వేల 100 మందికి పైగా కరోనాతో చనిపోయారు. ఫస్ట్‌వేవ్‌లో కూడా ఒక్కరోజులో ఇన్ని మరణాలు ఎప్పుడూ నమోదుకాలేదు. లాన్‌సెట్ నివేదిక చెప్పింది చెప్పినట్లు జరుగుతోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే రోజుకు 3 వేల మంది చనిపోయే అవకాశం కూడా కనిపిస్తోంది. అటు పాజిటివిటీ రేటు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజు పాజిటివిటీ రేటు దాదాపు 20శాతంగా నమోదైంది. దేశంలోకి కరోనా మొదలయ్యాక ఇంత పాజిటివిటీ రేటు ఇప్పటిదాకా ఎప్పుడూ కనిపించలేదు.
కరోనా సెకండ్‌వేవ్ ధాటికి దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. మహారాష్ట్రలో పరిస్థితి మహాఘోరంగా ఉంది. ఎన్ని ఆంక్షలు పెట్టినా కేసుల సంఖ్య పెరుగుతుందే కానీ.. తగ్గడం లేదు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్ ప్రకటించినా వైరస్‌కు బ్రేకులు పడకపోవడంతో మరిన్ని కఠిన ఆంక్షలు ప్రకటించింది. ఇవాళ రాత్రి 8గంటల నుంచి మే 1వరకు కొత్తగా ప్రకటించిన ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపింది. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాన్నీ 15శాతం మందితో మాత్రమే పనిచేసేందుకు అవకాశం కల్పించింది. వివాహాలు లాంటి శుభకార్యాలకు 25మంది మించరాదని పరిమితి విధించింది. అలాగే.. ఒకే హాలులో రెండు గంటలకు మించకుండా ఈ శుభ కార్యాన్ని పూర్తి చేసుకోవాలని, నిబంధనల్ని అతిక్రమిస్తే 50వేల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
అటు ఉత్తర ప్రదేశ్‌లో కరోనా కల్లోలం ఆగడంలేదు. 30 వేలకు పైగా రోజువారి కేసులతో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. మహారాష్ట్రకు ఏ మాత్రం తీసిపోని విధంగా కొత్త కేసులు అక్కడ నమోదవుతున్నాయి. ఒక్కరోజులో 33 వేల 214 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దేశంలో మహారాష్ట్ర తప్ప మరే రాష్ట్రంలోనూ 30 వేల పాజిటివ్ కేసులు నమోదుకాలేదు.
అటు ఢిల్లీలో రోజుకు దాదాపు 25 వేల పాజిటివ్ కేసులతో కరోనా విలయం కొనసాగుతుండగా.. కర్ణాటక, కేరళలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. నిన్న మొన్నటిదాకా 20 వేల పాజిటివ్ కేసులు ఎప్పుడూ నమోదుకాని ఈ దక్షిణాది రాష్ట్రాల్లో నిత్యం 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే కరోనాకు హాట్ స్పాట్‌గా దక్షిణాది రాష్ట్రాలు నిలిచేలా కనిపిస్తున్నాయి. కర్ణాటకలో వరుసగా రెండో రోజు కూడా 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవగా.. కేరళలో తొలిసారి 20 వేల పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.