ప్రతి 15మంది భారతీయుల్లో ఒకరికి కరోనా… ICMR సర్వే

coronavirus in india- icmr survey కరోనా మహమ్మారి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR).మంగళవారం రెండవ జాతీయ సెరో సర్వే రిపోర్ట్ లోని కీలక విషయాలను వెల్లడించిన ICMR…. ఆగస్టు- 2020 నాటికీ దేశంలో ప్రతి 15 మంది(పదేళ్లకు పైబడిన) లో ఒకరికి కరోనా వచ్చిందని తెలిపింది. 29వేల మందిపై సర్వే చేయగా… 6.శాతం మంది గతంలో కరోనా బారినపడినట్లు తేలిందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లోని మురికివాడలు, అర్బన్ నాన్ స్లమ్ ఏరియాస్‌లో కరోనావైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని గుర్తించినట్లు బలరాం భార్గవ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో రెండు రేట్లు ఎక్కువగా, పట్టణ ప్రాంతాల మురికివాడల్లో నాలుగు రేట్లు ఎక్కువగా కరోనా ప్రభావం ఉందని తెలిపారు. పట్టణ మురికివాడల్లో 15.5 శాతంగా కరోనా ప్రభావం ఉండగా, మురికివాడలు లేని పట్టణ ప్రాంతాల్లో ఈ మహహ్మారి ప్రభావం 8.2 శాతం ఉందన్నారు.
అంతేగాకుండా, దేశ యువతలో 7.1 శాతం మంది జనాభా కరోనా బారినపడినట్లు ఐసీఎంఆర్ సెరో సర్వేలో గుర్తించారు. ఈ ఫలితాలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ .. ఐసిఎంఆర్ రెండవ సెరో-సర్వే నివేదిక ఫలితాలు భారతదేశంలో గణనీయమైన జనాభా ఇప్పటికీ కోవిడ్ -19 కి గురయ్యే అవకాశం ఉందని వెల్లడించిందని చెప్పింది..కాగా, 0.73 శాతం మందికే కరోనా సోకిందని మొదటి సెరో-సర్వే మే 2020 వెల్లడించిన విషయం తెలిసిందే.
మరోవైపు, ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ.. భారత జనాభా ఇంకా హార్డ్ ఇమ్యూనిటీని సాధించలేకపోతోందని అన్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ కరోనాను నియంత్రించేందుకు ప్రజలు సహకరించాలని ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ కోరారు.