రిపబ్లిక్ డే : జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతినుద్దేశించి ప్రసంగించారు.

  • Published By: veegamteam ,Published On : January 26, 2019 / 06:23 AM IST
రిపబ్లిక్ డే : జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

Updated On : January 26, 2019 / 6:23 AM IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతినుద్దేశించి ప్రసంగించారు.

ఢిల్లీ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. దేశ పౌరులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్రపతి రామ్ నాథ్ సూచించారు. బహుళత్వమే భారతదేశ బలమని… ఇందులో యువత పాత్ర కీలకమని అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగించిన రాష్ట్రపతి… అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించడం అద్భుతమైన చర్యగా కొనియాడారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ పవిత్రమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దేశ ప్రజలను కోరారు. భారత 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి… ఈ ఏడాదిలో జరిగే ఎన్నికలను 21వ శతాబ్దంలో భారతదేశాన్ని రూపుదిద్దేందుకు వచ్చిన అద్భుత అవకాశంగా పరిగణించాలన్నారు. 

ఎన్నికలు అంటే కేవలం రాజకీయ క్రమం కాదని, విజ్ఞత, వివేచన కోసం ఇచ్చే సమిష్టి పిలుపు అని వ్యాఖ్యానించారు. మన ప్రజాస్వామ్య సిద్ధాంతాలు, ఆదర్శాలు 17వ లోక్‌సభను ఎన్నుకోవడంలో ప్రతిబింబించాలని అన్నారు. వైవిధ్యత, ప్రజాస్వామ్యం, అభివృద్ధి అనే మూడు అంశాలే పునాదిగా బహుళత్వంలో ఏకత్వం అన్న భావనతో భారతదేశం పరిఢవిల్లుతోందని… వీటిల్లో ఏదో ఒకదానితో ముందుకు సాగలేమన్నారు. మూడింటితోనూ పయనం సాగాలని ఉద్బోధించారు. 

బహుళత్వమే మన దేశానికున్న అతి పెద్ద బలమని తన స్పీచ్ లో చెప్పారు రాంనాథ్ కోవింద్. ప్రస్తుతం దేశం చాలా కీలకమైన దశలో ఉందన్న ఆయన… ఈనాటి నిర్ణయాలే రేపటి భారతాన్ని నిర్దేశిస్తాయన్నారు. దేశ నిర్మాణంలో యువతరం పాత్ర చాలా కీలకమైందని చెప్పారు. ఇంకా భర్తీ చేయాల్సిన అంతరాలు ఉన్నాయన్న కోవింద్.. తుడవాల్సిన కన్నీళ్ళు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఎన్ని విజయాలు సాధించామనే దానికన్నా ఆ విజయాలు ఎంత నాణ్యతతో కూడినవనే దానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

అగ్రవర్ణాల్లోని పేదలకు 10శాతం రిజర్వేషన్లను ప్రస్తావించిన ఆయన.. ఇదొక అద్భుతమైన చర్య అని కొనియాడారు. వెనుకబడిన వర్గాలు లేదా గ్రూపులతో నిజాయితీగా చర్చలు జరగాలని, వారి సాధకబాధలు కూడా వినాల్సిన అవసరం కూడా వుందని అన్నారు. లింగ సమానత్వం, అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే భారతదేశంలో సామాజిక మార్పునకు ప్రధాన సూచిక అని ఆయన పేర్కొన్నారు. దేశంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని… కళల నుండి కదన రంగం దాకా వారికి తిరుగులేకుండా పోయిందని చెప్పారు. ఈ ప్రయాణం ఆగకూడదని ఆయన ఆకాంక్షించారు. మన దేశ భవితవ్యానికి ఇదే సరైన పంథా అని అన్నారు.