వైరల్ : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేమ్ ప్లేట్

అమరావతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి 48 గంటలు గడిచిందో లేదో.. అప్పుడే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే పేరుతో తయారు చేసిన నేమ్ బోర్డు తయారైంది. ఈ నేమ్ బోర్డు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగన్, వైసీపీ అభిమానులు ఈ నేమ్ ప్లేట్ ను తెగ షేర్ చేస్తున్నారు. ఎస్..కాబోయే సీఎం జగన్ అని గట్టిగా చెబుతున్నారు.
వాస్తవానికి ఏప్రిల్ 11న జరిగింది దేశంలో మొదటి విడత ఎన్నికల పోలింగ్ మాత్రమే. ఇంకా 6 విడతల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగాల్సి ఉంది. మే 23న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితం ప్రకటిస్తారు. ఈలోపే కొందరు అత్యుత్సాహం చూపి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , ఏపీ సీఎం అని నేమ్ బోర్డు కూడా రెడీ చేశారు. గెలుస్తామనే కాన్ఫిడెన్స్ తో జగన్ కోసం సన్నిహితులు ఈ బోర్డును తయారు చేయించారా? వ్యతిరేక ప్రచారం కోసం ప్రత్యర్థి వర్గాలు ఇలా ప్లాన్ చేశాయా? అన్నది తెలియాల్సి ఉంది.
పలు సర్వేలు కూడా వైసీపీకి అనుకూలంగా వచ్చాయి. ఈసారి భారీ మెజార్టీతో వైసీపీ గెలవడం ఖాయం అంటున్నాయి. ప్రశాంత్ కిషోర్ టీమ్ కూడా ఇదే చెప్పింది. వైసీపీకి 130 అసెంబ్లీ, 20 ఎంపీ స్థానాలు వస్తాయని పీకే సర్వేలో తేలిందట. దీంతో జగన్ ను ఆయన అభినందించారు కూడా. ఏపీ సీఎం జగన్ నేమ్ ప్లేట్ వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అంతిమ ఫలితం ఎలా ఉంటుందో మే 23వ తేదీ తెలుస్తుంది.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈవీఎంల అవకతవకలపై పోరుబాట పట్టారు. ఢిల్లీకి వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేసారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల మద్దతు కూడగడుతున్నారు. ఏపీలో పోలింగ్ రోజున ఈవీఎంల దుర్వినియోగం జరిగిందనేది చంద్రబాబు ఆరోపణ.