టార్గెట్ కుప్పం, చంద్రబాబు మరో నియోజకవర్గానికి తరలిపోయేలా జగన్ మాస్టర్ ప్లాన్

  • Published By: naveen ,Published On : August 4, 2020 / 12:01 PM IST
టార్గెట్ కుప్పం, చంద్రబాబు మరో నియోజకవర్గానికి తరలిపోయేలా జగన్ మాస్టర్ ప్లాన్

Updated On : August 4, 2020 / 12:14 PM IST

కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నది అధికార వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. 151 సీట్లతో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుని, టీడీపీని చావు దెబ్బ తీసిన వైసీపీ… ఇప్పుడు కొత్త వ్యూహంతో ముందుకెళుతోందట. టార్గెట్ కుప్పం పేరిట ఓ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. కుప్పంలో టీడీపీ ముఖ్య నేతలను ఆకర్షించడం, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందేలా చూడటం, సంస్థాగతంగా బలపడడం ద్వారా… ప్రతిపక్షాన్ని అక్కడ బలహీనపరచాలన్న వ్యూహాత్మక ఎత్తుగడతో వైసీపీ ముందుకెళుతోందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి మరో నియోజకవర్గానికి తరలిపోయేలా చేయడమే ఈ యాక్షన్ ప్లాన్‌ అసలు లక్ష్యం అంటున్నారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు కుప్పం నేతలతో తరచుగా ఫోన్ లో టచ్‌లోకి వస్తున్నారట. కుప్పం కేంద్రంగా జరుగుతున్న టీడీపీ, వైసీపీ గేమ్ ప్లాన్ ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.

గట్టిగా ప్రయత్నిస్తే చంద్రబాబుని దెబ్బకొట్టడం కష్టమేమీ కాదు:
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం అంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు కంచుకోట. గడచిన ఏడు మార్లు వరుసగా కుప్పం నుంచే బాబు గెలుస్తూ వస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ కాస్త తగ్గినా… ఇక్కడ పసుపు జెండా ఎగరడం మాత్రం ఖాయం. ఈ కోటకు బీటలు వేయాలన్నది వైసీపీ తాజా వ్యూహంలా కనిపిస్తోంది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో కుప్పం ఫలితాల మొదటి రౌండ్లో చంద్రబాబు కాస్త వెనుకబడ్డ అంశం వైసీపీ నేతల మైండ్‌లో బాగా ఫిక్స్ అయిందట. గట్టిగా ప్రయత్నిస్తే బాబును దెబ్బ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదని ఇప్పటికీ వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారట. అందులో భాగంగానే టార్గెట్ కుప్పం అమలు చేస్తున్నారని ఇన్నర్ టాక్.