తృణమూల్ కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలి : కన్నా లక్ష్మీనారాయణ

విజయవాడ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ హత్యా రాజకీయాలను ప్రోత్సాహిస్తున్నారని, టీఎంసీ పార్టీని రద్దు చేయాలి అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ జాతీయఅధ్యక్షుడు అమిత్షా చేపట్టిన ర్యాలీపై టీఎంసీ కార్యకర్తలు మంగళవారం చేసిన దాడికి నిరసనగా విజయవాడ ధర్నాచౌక్లో బీజేపీ నాయకులు బుధవారం నిరసన చేపట్టారు.
మమత బెనర్జీ పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. మమతను ప్రోత్సాహించిన చంద్రబాబు పై కూడా చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. అన్ని పార్టీలు ఏకమై బీజేపీని ఓడించాలని చూస్తున్నారని, చంద్రబాబు పాలనకు ఓటర్లు చరమగీతం పాడారని, మే 23న ఫలితాలు వస్తున్నాయని కన్నా లక్ష్మినారాయణ అన్నారు.