వైసీపీ గెలిస్తే కేసీఆర్ గెలిచినట్లే : పవన్ కళ్యాణ్

కృష్ణా జిల్లా: నూజివీడులో వైసీపీ అభ్యర్థి గెలిస్తే కేసీఆర్ గెలిచినట్లే అని.. ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిన్నట్లే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రులకు పౌరుషం లేదా.. కేసీఆర్ కు బానిసలమా అని ప్రశ్నించారు. నూజివీడులో పవన్ ఎన్నికల ప్రచారం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. సీఎం చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే ఏపీలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. ప్రతిపక్ష నేతగా ఏమీ చేయలేని వ్యక్తి సీఎం అయితే మాత్రం ఏం చేస్తారు అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. వైసీపీ చీఫ్ జగన్ ను ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజా సమస్యల గురించి పట్టించుకోకుండా జగన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పవన్ విమర్శించారు.
జనసేన అధికారంలోకి వస్తే నూజివీడును అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో నూజివీడులో మ్యాంగో ఫెస్టివల్ చేద్దామన్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీలు వందల హామీలు ఇచ్చి 10 హామీలను కూడా అమలు చేయడం లేదన్నారు. తాను మాత్రం అలా చేయనని పవన్ చెప్పారు. నేను ఎక్కువ చెప్పను చేసి చూపిస్తా అని అన్నారు. ఇతర పార్టీల్లా.. ఒక్క పథకం కూడా నా పేరు మీద పెట్టను అని.. మహానుబావుల పేర్ల మీద పథకాలు పెడతామని పవన్ వెల్లడించారు. జనసేన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పవన్ పిలుపునిచ్చారు.