గెలిచేనా : టి. మున్సిపోల్..సై అంటున్న టీడీపీ

  • Published By: madhu ,Published On : December 29, 2019 / 11:35 AM IST
గెలిచేనా : టి. మున్సిపోల్..సై అంటున్న టీడీపీ

Updated On : December 29, 2019 / 11:35 AM IST

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమంటోంది టీడీపీ. గత ఎన్నికల్లో చావు దెబ్బతినన్న ఈ పార్టీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని చతికిలపడింది. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తోంది. ఒంటరిగా బరిలోకి దిగాలని భావిస్తోంది. కానీ ఎవరిని క్యాండిటేడ్‌గా ప్రకటించాలనే దానిపై తర్జనభర్జనలు పడుతోంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఖాళీ అయిపోయింది.

అయితే..తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో కొందరు అలానే పార్టీని అంటిపెట్టుకున్నారు. వీరికి అవకాశం కల్పించాలని అధిష్టానం నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పించి.. వారిని గెలిపించుకునేందకు శక్తివంచన లేకుండా కృషిచేయాలని టీ-టీడీపీ సంకల్పించింది. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి శ్రమిస్తున్నారు నేతలు. 2018 ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు గె లిస్తే..ఒక ఎమ్మెల్యే జంప్ అయిపోయారు. ఉన్న ఒక్క  ఎమ్మెల్యేను కాపాడుకోవడానికి పడరానిపాట్లు పడుతోంది.

* మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి టీడీపీ ఆసక్తి
* చేజారుతున్న కేడర్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నాలు
* పార్టీకి పట్టున్నచోట అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రణాళికలు
* కొన్ని స్థానాలు గెలిచినా పార్టీ బలపడుతుందన్న యోచనలో టీడీపీ

అప్పుడప్పుడు తెలంగాణ టీడీపీ పార్టీ నేతలతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భేటీ అవుతూ..రాష్ట్రంలోని పరిస్థితిప ఆరా తీస్తున్నారు. పార్టీ ప్రతిష్ట కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై వారికి సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అంతేగాకుండా..ఎన్టీఆర్ భవన్‌కు వచ్చి..కార్యకర్తలు, పార్టీ నేతలతో సమావేశం జరుపుతున్నారు బాబు. హైదరాబాద్ లో మకాం వేసి మిగిలిన క్యాడర్‌ చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తాజాగా తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలను పార్టీని బలోపేతం చేయడానికి వినియోగించుకోవాలని టీడీపీ యోచిస్తోంది. పార్టీకి పట్టున్న వార్డుల్లో ముఖ్య నేతలంతా ప్రచారం చేయాలని నిర్ణయించారు.  రిజర్వేషన్లు ఖరారు కాగానే అభ్యర్థులను ప్రకటించనున్నారు.