కులం పేరుతో తిడతారా అంటూ.. నన్నపనేనిపై మహిళా ఎస్ఐ ఆక్రోశం

  • Published By: chvmurthy ,Published On : September 11, 2019 / 08:13 AM IST
కులం పేరుతో తిడతారా అంటూ.. నన్నపనేనిపై మహిళా ఎస్ఐ ఆక్రోశం

Updated On : September 11, 2019 / 8:13 AM IST

టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన  చలో ఆత్మకూరు  పిలుపు సందర్భంగా టీడీపీ నాయకులు అత్యుత్సాహం చూపుతున్నారు. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్‌ అమల్లో ఉన్నప్పటికీ  వారు అవేమి పట్టించుకోలేదు. చంద్రబాబు ఇంటివద్దకు వస్తున్ననాయకులను అడ్డుకుంటున్న పోలీసులపై విచక్షణారహితంగా  వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడుతున్నారు. సాటి మహిళ అని కూడా చూడకుండా టీడీపీ మహిళా నాయకురాళ్ళు దూషణకు దిగడంతో చంద్రబాబు ఇంటివద్ద విధులు నిర్వపిస్తున్న ఒక మహిళా ఎస్‌ఐ మనస్తాపానికి గురై విధుల నుంచి వెళ్లిపోయారు. 

చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చిన  రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఇతర టీడీపీ  మహిళా నాయకురాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో  ‘దళితుల వల్లనే దరిద్రం’ అంటూ అక్కడే విధుల్లో ఉన్న దళిత మహిళా ఎస్‌ఐ అనురాధపై నన్నపనేని నోరు పారేసుకున్నారుట. 

ఆమె వ్యాఖ్యలతో కలత చెందిన ఎస్‌ఐ అనురాధ ఆవేదనతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేగా, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా పనిచేసిన నన్నపనేని ఎలా మాట్లాడడం సరికాదని మహిళా ఎస్ఐ  ఆక్రోశం వెలిబుచ్చారు.తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకురాళ్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. నన్నపనేని రాజకుమారితో మహిళా ఎస్సై  తన ఆవేదన వెలిబుచ్చే వీడియో  ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.