TDPలో తర్జనభర్జనలు : మహానాడు జరిగేనా

TDP ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు కార్యక్రమం ఈ ఏడాది ఉంటుందా..? లేక వాయిదా పడుతుందా..? అనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో సమయం సరిపోతుందా..? లేదా..? అనే తర్జనభర్జనలు పార్టీలో జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకోవడమా..? లేక మహానాడుని వాయిదా వేయడమా..? అన్నది తెలీక టీడీపీ సతమతమవుతోంది.
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మే 28న మహానాడు నిర్వహించుకోవడం టీడీపీకి ఆనవాయితీగా ఉంది. రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల్లో కూడా మహానాడు నిర్వహిస్తున్నారు. ఏటా మే 27, 28, 29 తేదీల్లో 3 రోజులపాటు మహానాడు నిర్వహిస్తూ వస్తున్నారు. మే మొదటి వారం నుంచి జిల్లాల వారీగా మినీ మహానాడులు నిర్వహించి వాటిలో చర్చించిన అంశాలను మహానాడులో తీర్మానాల రూపంలో ప్రవేశపెడతారు. ఈసారి మహానాడు నిర్వహణపై పార్టీ అధినేత నిర్ణయం ఎలా ఉంటుందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఉండటమే దీనికి కారణం. మహానాడుకి ఎన్నికల ఫలితాలకి మధ్య సమయం తక్కువగా ఉండటంతో నిర్వహణపై ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది టీడీపీ అధిష్టానం. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంతవరకూ టీడీపీకి ఇటువంటి పరిస్థితి ఎదురు కాలేదు.
ప్రతి ఏడాది మహానాడుకు నెల ముందుగానే ఓ బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తుంది టీడీపీ అధిష్టానం. మహానాడుని ఎక్కడ నిర్వహించాలి..? నిర్వహణ కమిటీల ఏర్పాటు, జిల్లాలో మినీ మహానాడుకు పరిశీలకుల నియామకం తదితర అంశాల్లో హడావిడి జరిగేది. కానీ ఈ ఏడాది ఇంతవరకు మహానాడు నిర్వహణపై చర్చ జరగలేదు. గతంలో ఎన్నికల సమయంలో రెండు సార్లు మహానాడు వచ్చిందని.. ఒకసారి వాయిదా వేసి తర్వాత నిర్వహిస్తే.. మరోసారి మే 28 ఒక్కరోజు మాత్రమే నిర్వహించారని పార్టీ పెద్దలు చెబుతున్నారు. ఈసారి జిల్లాలో మినీ మహానాడులు ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.
మే నెల మొదటి వారం నుంచి రోజుకు 2 పార్లమెంట్ నియోజకవర్గాల చొప్పున అధినేత సమీక్షలు చేస్తారని.. దానికి మండలస్థాయి నాయకులను కూడా ఆహ్వానిస్తున్నామని.. అందువల్ల ఈసారి జిల్లాలో మినీ మహానాడులు ఉండవని చెబుతోంది టీడీపీ హైకమాండ్. మహానాడు నిర్వహణపై ముఖ్యంగా రెండు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటిది ఎన్టీఆర్ జయంతి అయిన మే 28 ఒక్కరోజు మాత్రమే నిర్వహించడం.. రెండోది మహానాడును వాయిదా వేసి తర్వాత భారీ ఎత్తున నిర్వహించటం. ఈ రెండు ప్రతిపాదనలపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా హిమాచల్ ప్రదేశ్ పర్యటన నుంచి వచ్చాక చంద్రబాబు మహానాడు నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారని పార్టీ పెద్దలు చెబుతున్నారు.