CAAను రద్దు చేయండి : తెలంగాణ కేబినెట్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన CAA చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ కేబినెట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించింది. 2020, ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా CAAపై సుదీర్ఘంగా చర్చించారు. భారత పౌరసత్వం ఇచ్చే విషయంలో మతపరమైన వివక్ష చూపరాదని కేంద్రాన్ని కోరింది. చట్టం ముందు అన్ని మతాలను సమానంగా చూడాలని విజ్ఞప్తి చేసింది. గతంలో కూడా సీఏఏపై సీఎం కేసీఆర్ పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పౌరసత్వం చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వానిది వంద శాతం తప్పుడు నిర్ణయమన్నారు. సీఏఏ గురించి చాలా మంది ముఖ్యమంత్రులతో, ఇతర పార్టీల నాయకులతో తాను మాట్లాడడం జరిగిందని గతంలో చెప్పారు.
రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలు, ముఖ్యమంత్రులతో హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. అవసరమైతే లక్షల మందితో సభ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో సమావేశాల్లో తీర్మానం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఏఏకు మద్దతు ఇవ్వబోమని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.
Read More : టి.కేబినెట్ విశేషాలు : రోగులకు వైద్య పరీక్షలు ఫ్రీ