అధికారపక్షమా.. ప్రతిపక్షమా.. గ్రేటర్‌లో బీఆర్ఎస్ కార్పొరేటర్ల పరిస్థితి ఏంటి?
నాలుగేళ్ల వరకు అవిశ్వాసం పెట్టే ఛాన్స్ లేకపోవడంతో మరో ఏడాది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రస్తుత మేయర్, డిప్యూటీ మేయర్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

BRS Role In GHMC : గ్రేటర్ హైదరాబాద్ పాలక మండలిలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల పరిస్థితి ప్రస్తుతం ఏంటన్నది ఆసక్తి రేపుతోంది. ఆ పార్టీ కార్పొరేటర్లు ఇప్పుడు తాము అధికార పక్షమా.. ప్రతిపక్షమా అని తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. గ్రేటర్‌లో రెండోసారి పాగా వేసిన బీఆర్ఎస్‌కు కొత్త చిక్కులు తప్పేలా లేవు. సాంకేతికంగా బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నా.. మారిన రాజకీయ పరిస్థితులతో ఆ పార్టీ కార్పొరేటర్లు ఎలా వ్యవహరిస్తారన్నది చర్చనీయంశంగా మారింది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో మారిన సీన్..
2019లో రెండోసారి అధికారం చేపట్టిన గులాబీ పార్టీ.. తిరిగి హైదరాబాద్ మేయర్ పీఠాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొదటిసారి భారీ మెజార్టీతో మేయర్ పదవిని తమ ఖాతాలో వేసుకున్నా.. రెండోసారి మాత్రం గ్రేటర్‌లో దాదాపు సగం స్థానాలను కోల్పోయింది. అయినా మెజార్టీ స్థానాలు గెలుచుకొని గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగురవేసింది. మేయర్‌గా సీనియర్ పొలిటీషియన్ కేకే కూతురు గద్వాల విజయలక్ష్మికి పార్టీ అవకాశం కల్పించింది. ఇక డిప్యూటీ మేయర్‌గా మోతే శ్రీలతా రెడ్డిని ఎంపిక చేసింది గులాబీ పార్టీ. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. అంతా సవ్యంగానే జరిగినా ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఫలితాల తర్వాత ప్రభావం గ్రేటర్‌పై భారీగానే పడింది.
ఇక సర్వసభ్య సమావేశాల్లో బీఆర్ఎస్ పాత్ర నామమాత్రమే..!
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. బీఆర్‌ఎస్‌కు చెందిన మేయర్, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. వీరితోపాటు మరికొంత మంది కార్పొరేటర్లు కూడా హస్తం గూటికి చేరుకున్నారు. ఎన్నికలకు దాదాపు రెండేళ్ల సమయం ఉండడంతో రాబోయే రోజుల్లో మరికొంతమంది కార్పొరేటర్లు కూడా అధికార పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. అటు హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే స్థానం కూడా దక్కకపోవడంతో.. ఎమ్మెల్యేలను టార్గెట్‌గా చేసి తమ పార్టీలో కలుపుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. దీంతో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అధికార పార్టీ టచ్‌లోకి వెళ్తే గ్రేటర్ సర్వసభ్య సమావేశాల్లో బీఆర్ఎస్ పాత్ర నామమాత్రంగానే మారిపోయే ఛాన్స్ కనిపిస్తోంది.
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం కూడా లేదు..
అయితే ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు మెజార్టీ సభ్యుల బలం ఉన్నప్పటికి.. పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్‌లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం కూడా లేదు. నాలుగేళ్ల వరకు అవిశ్వాసం పెట్టే ఛాన్స్ లేకపోవడంతో మరో ఏడాది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రస్తుత మేయర్, డిప్యూటీ మేయర్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాంకేతికంగా బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్‌లో అధికార పీఠంపై ఉన్నా దాని ప్రభావం అంతంత మాత్రమే ఉండనుంది. ఇక గ్రేటర్‌లో చక్రం తిప్పే ఎంఐఎం పార్టీ అధికార పార్టీతో సమన్వయంగా ముందుకు వెళుతుంది. ఈ కారణంగా బీఆర్ఎస్ ఒంటరిగానే తమ గళాన్ని వినిపించాల్సిన పరిస్థితి నెలకొంది.
అధికార పక్షమా? ప్రతిపక్షమా?
ప్రస్తుతం గులాబీ పార్టీ కార్పొరేటర్లకు గ్రేటర్ పాలకమండలిలో తాము అధికారమా ప్రతిపక్షమా అని తేల్చుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మరికొద్ది రోజుల్లో జరిగే గ్రేటర్ హైదరాబాద్ పాలకమండలి సర్వసభ్య సమావేశంపై గులాబీ పార్టీ పెద్దలు ఎలాంటి సూచనలు చేస్తారన్న దానిపై ఆ పార్టీ కార్పొరేటర్లు ఎదురుచూస్తున్నారు.
Also Read : రఘునందన్‌తో హరీష్ రావు చెట్టా పట్టాల్.. త్వరలోనే బీజేపీలోకి: ప్రభుత్వ విప్‌లు