జగన్ పేరుతో గెలిచిన ఆ ఎంపీ కనిపించడం లేదట
అమెరికా ఎక్కడుంది? ఏలూరు పక్కన.. మరి ఏలూరు ఎక్కడుంది? అమెరికా పక్కన. అదేంటి.. ఏలూరు.. అమెరికా పక్కపక్కనే ఉన్నాయని అనుకుంటున్నారా? అబ్బే.. మనకు

అమెరికా ఎక్కడుంది? ఏలూరు పక్కన.. మరి ఏలూరు ఎక్కడుంది? అమెరికా పక్కన. అదేంటి.. ఏలూరు.. అమెరికా పక్కపక్కనే ఉన్నాయని అనుకుంటున్నారా? అబ్బే.. మనకు
అమెరికా ఎక్కడుంది? ఏలూరు పక్కన.. మరి ఏలూరు ఎక్కడుంది? అమెరికా పక్కన. అదేంటి.. ఏలూరు.. అమెరికా పక్కపక్కనే ఉన్నాయని అనుకుంటున్నారా? అబ్బే.. మనకు కాదులెండి.. మన ఏలూరు ఎంపీ గారికి అమెరికా పక్కనే ఉంది. అందుకే ఏడు నెలల కాలంలో రెండు మూడుసార్లు ట్రిప్పులు పూర్తి చేసేశారు. మరి ఎంపీ గారెక్కడున్నారంటే ఏలూరు వైపు వేలు చూపించాలా? అమెరికా వైపు చూపించాలా? అన్నది అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు ఆయనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలు.
2017లో అమెరికా నుంచి వచ్చి వైసీపీలో చేరిన శ్రీధర్:
పశ్చిమగోదావరి జిల్లాలో కోటగిరి ఫ్యామిలీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన కోటగిరి విద్యాధరరావు తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. చింతలపూడి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, అనేక మంత్రి పదవులను చేపట్టడంతో పాటు జిల్లాలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు. కోటగిరి విద్యాధరరావు రాజకీయ వారసుడిగా అమెరికా నుంచి నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు కోటగిరి శ్రీధర్. 2014లో బీజేపీలో చేరిన కోటగిరి శ్రీధర్ ఆ తర్వాత మళ్లీ అమెరికా వెళ్లిపోయారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2017లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు.
2017 నుంచి 19 వరకూ అమెరికాకు అధికంగా చక్కర్లు:
కోటగిరి శ్రీధర్‌గా ఎవరికీ పెద్దగా తెలియకపోయినా కోటగిరి విద్యాధరరావు వారసుడిగా మాత్రం జిల్లా ప్రజలకు దగ్గరైపోయారు. వైసీపీ నుంచి ఏలూరు ఎంపీ అభ్యర్థిగా బలమైన నాయకుడు లేకపోవడంతో ఆర్థికంగా బలవంతుడైన కోటగిరి శ్రీధర్‌కి ఏలూరు ఎంపీగా సీటు ఇస్తానని జగన్ ప్రకటించారు. దీంతో వైసీపీ నుంచి రాజకీయాల్లో మరోసారి ప్రయాణం మొదలు పెట్టారు. 2017 నుంచి 2019లో జరిగిన ఎన్నికల వరకు కోటగిరి శ్రీధర్ ఏలూరు నుంచి అమెరికాకు ఎక్కువసార్లు చక్కర్లు కొట్టారు తప్ప నియోజకవర్గంలో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాత్రం ఒక్కసారి కూడా పూర్తిగా తిరగలేదు. అప్పుడప్పుడు నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యే అభ్యర్థులు పెట్టిన పార్టీ కార్యక్రమాలకు హాజరై ఆ తర్వాత కనిపించే వారు కాదు.
7 నెలల్లో ఒక్కసారి కూడా నియోజకవర్గంలో పర్యటించని ఎంపీ:
ఎన్నికల ముందు కూడా కోటగిరి శ్రీధర్‌ని గెలిపిస్తే అలాంటి అనుభవమే నియోజకవర్గం ప్రజలకు ఎదురయ్యే అవకాశం ఉందనుకున్నా జగన్ వేవ్ ముందు అవన్నీ చిన్నగా కనిపించాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా 2019 ఎన్నికల తర్వాత నియోజకవర్గం ప్రజలకు అసలు సమస్య మొదలైందని అంటున్నారు. ఏలూరు ఎంపీగా గెలిచి ఏడు నెలల గడుస్తున్నా ఒక్కసారి కూడా నియోజకవర్గంలో పర్యటన చేయలేదు. కానీ ఇప్పటికే ఈ ఏడు నెలల్లో రెండుసార్లు అమెరికా వెళ్లినట్లు నియోజకవర్గంలో అనుకుంటున్నారు. ఎంపీగా నియోజకవర్గంలో కానీ, ఢిల్లీలో కానీ ఉండే సమయం కన్నా అమెరికాలో ఉండే సమయమే ఎక్కువగా ఉందని గుసగుసలు ఆడుకుంటున్నారు.
సొంత వ్యాపారాలను చక్కబెట్టుకోవడంపైనే శ్రద్ధ:
ప్రభుత్వ పరంగా నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ ఒక్క కార్యక్రమం కానీ, పర్యటన కానీ చేపట్టలేదట శ్రీధర్. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక జనాలు దిక్కులు చూస్తున్నారు. ఎంపీ ఎప్పుడు అందుబాటులో ఉంటారన్నది ఎవరికీ తెలియదు. ఇదంతా చూస్తున్న వాళ్లు అమెరికాలో ఉండే ఆయనను అనవసరంగా ఎన్నుకున్నాం కదా అని ఫీలవుతున్నారట. తన తండ్రి రాజకీయ వారసుడిగా రాజకీయాలలోకి వచ్చిన కోటగిరి శ్రీధర్ ఇప్పటి వరకు తండ్రికి తగ్గ తనయుడు అనేలా ఒక్క కార్యక్రమం చేపట్టలేదు. కనీసం ఏలూరులో ఉండే సమయంలో అయినా ప్రజలకు అందుబాటులో ఉంటారా అంటే అదీ లేదంట. సొంత వ్యాపారాలను చక్కబెట్టుకోవడంలోనే శ్రద్ధ చూపిస్తున్నారంటున్నారు.
ఏలూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న కీలకమైన పోలవరం ప్రాజెక్ట్‌ను శ్రీధర్ ఇప్పటి వరకు చూసింది లేదు. పోలవరం నిర్వాసితులు ఇళ్ల నిర్మాణం జరగక, నష్టపరిహారం అందక తమ గోడు ఎంపీకి చెప్పుకుందామని వస్తే ఆయనేమో అందుబాటులో ఉండే పరిస్థితి లేదని అంటున్నారు. నియోజకవర్గంలో జనాల్లో ఎక్కువ మందికి అసలు శ్రీధర్ అంటే ఎలా ఉంటారో కూడా తెలియదు.