సిరీస్ సమం : ఆఖరి టీ20లో సఫారీల విజయం

  • Published By: madhu ,Published On : September 23, 2019 / 01:03 AM IST
సిరీస్ సమం : ఆఖరి టీ20లో సఫారీల విజయం

Updated On : September 23, 2019 / 1:03 AM IST

అనుభవం లేని ఆటగాళ్లతో ఏం చేస్తుందిలే అనుకున్న దక్షిణాఫ్రికా అనూహ్యంగా విజృంభించింది. ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో టీమిండియాను ఓడించింది. ప్రారంభంలో ఆధిపత్యం చూపినా దానిని నిలబెట్టుకోలేకపోయిన కోహ్లి సేన ప్రత్యర్ధికి తేలిగ్గా తలొంచింది. వెరసి… మూడో టీ20లో సఫారీ జట్టు జయకేతనం ఎగురవేసింది. సిరీస్‌ను 1-1తో సమంగా ముగించింది.
సొంతగడ్డపై దక్షిణాఫ్రికా మీద తొలిసారి టీ20 సిరీస్‌ నెగ్గాలన్న టీమిండియా కోరిక నెరవేరలేదు.

బెంగళూరు వేదికగా జరిగిన మూడో టీ20లో బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమైన కోహ్లి సేన… సఫారీల చేతిలో 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. కెప్టెన్ క్వింటన్‌ డికాక్‌ 52 బంతుల్లో 79 పరుగులతో చెలరేగి ఆడి సఫారీ జట్టును గెలిపించాడు. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌… నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 36 రన్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ 19 పరుగులు, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా 19 పరుగులతో ఫర్వాలేదనిపించారు. రబడ మూడు వికెట్లు పడగొట్టగా… ఫార్చూన్‌, బ్యురాన్‌ హెన్‌డ్రిక్స్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో దక్షిణాఫ్రికాను డికాక్‌ ఒంటిచేత్తో నడిపించాడు. అతడి దూకుడైన బ్యాటింగ్‌తో ఆ జట్టు ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి 16.5 ఓవర్లలో 140 పరుగులు చేసి లక్ష్యాన్ని అందుకుంది. డికాక్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు దక్కింది.

సైనీ ఓవర్లో రెండు సిక్స్‌లతో ఊపులోకి వచ్చిన సఫారీ కెప్టెన్‌ ఎక్కడా తగ్గకుండా ఆడాడు. ఏ బౌలర్‌ను వదలను అన్నట్లుగా బౌండరీలు, సిక్స్‌లు బాదాడు. 38 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. హెన్‌డ్రిక్స్‌ను హార్దిక్‌ ఔట్‌ చేసినా అప్పటికే ఆలస్యమైంది. డికాక్‌ ధాటితో దక్షిణాఫ్రికా ఏ దశలోనూ ఛేదనలో ఇబ్బంది పడలేదు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ బవుమా ఓ చేయి వేయడంతో సఫారీలు లక్ష్యాన్ని అవలీలగా అందుకున్నారు.
Read More : చెలరేగిన దక్షిణాఫ్రికా బౌలర్లు: 134పరుగులు చేసిన టీమిండియా