సైనిక సేవ ముగిసింది….ప్రజాసేవలోకి ధోనీ

టీమిండియా మాజీ కెప్టెన్,జార్ఖండ్ డైనమైట్ ఎంఎస్ ధోనీ కొత్త అవతారం ఎత్తాడు. లెహ్‌లో సైనిక విధులు ముగించుకొని రాగానే పొలిటీషియన్ గా మారిపోయాడు. కుర్తా పైజామా, ఖద్దరు దుస్తులు ధరించి,తలపై టోపీ ధరించి రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేశాడు. దీంతో క్రికెట్‌కు వీడ్కోలు పలికి మహీ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టనున్నాడా? అన్న కథనాలు మొదలయ్యాయి. రాజకీయ నాయకుడిగా ఉన్న ధోనీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వెస్టిండీస్ సిరీస్‌కు ముందు ధోనీ కెరీర్‌పై విపరీతంగా చర్చ జరిగింది. ధోని క్రికెట్ కు గుడ్ బై చెప్పి పాలిటిక్స్ లో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే లెఫ్ట్‌నెంట్ కల్నల్ అయిన మహీ రెండు నెలలు సైన్యంలో చేరి దేశసేవ చేస్తానని ప్రకటించాడు. విండీస్ సిరీస్‌కు తనకు తానే దూరమయ్యాడు. ఈ క్రమంలోనే 15 రోజులు లెహ్‌లో విధులు నిర్వర్తించాడు. విరామం తీసుకొని ఇంటికి తిరిగి రాగానే..పొలిటికల్ లుక్స్ బయటికి వచ్చాయి.
అసలు ఇంతకీ ఏం జరగిందంటే…ఓ యాడ్ షూటింగ్ కోసం ధోనీ ముంబైవెళ్లాడు. అక్కడ కొన్ని సీన్స్ షూట్ చేశాడు. అందులో ఒక హోర్డింగ్‌పై మహీ రాజకీయ నాయకుడిగా కనిపించాడు. క్రేజీగా భావించిన అభిమానులు వెంటనే సోషల్ మీడియాలో వాటిని షేర్ చేసుకోవడం ప్రారంభించారు. దాంతో ఆ చిత్రాలు వైరల్‌గా మారిపోయాయి. పనిలో పనిగా కొందరు ‘సైనిక సేవ ముగిసింది. ప్రజాసేవ మొదలైంది అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.