RCBvsSRH: బెంగళూరు గెలిచేసింది

RCBvsSRH: బెంగళూరు గెలిచేసింది

Updated On : May 4, 2019 / 6:55 PM IST

ఐపీఎల్ 2019 సీజన్‌ ప్లేఆఫ్ రేసు అర్హత సాధించడానికి తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ ఓటమికి గురైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 4వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయింది. 176 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరుకి పేలవ ఆరంభం లభించింది. ఓపెనర్లు పార్థీవ్ పటేల్ (0) డకౌట్ అవగా.. మరో ఓపెనర్ విరాట్ కోహ్లి (16: 7 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సు) దూకుడు ఆడే ప్రయత్నంలో వికెట్ చేజార్చుకున్నాడు. డివిలియర్స్ (1) కూడా అదే తరహాలో నిరాశపరచడంతో బెంగళూరు 2.5 ఓవర్లలో 20/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. 

ఈ దశలో క్రీజులోకి వచ్చిన గుర్‌కీరత్‌‌సింగ్‌తో కలిసి హెట్‌మెయర్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆఖర్లో ఉమేశ్ యాదవ్ (9) దిగి వరుసగా రెండు బౌండరీలతో గెలుపు లాంఛనాన్ని మరో 4 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేశాడు. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌.. బెంగళూరుకు 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 46 పరుగుల వద్ద సాహా(20) వికెట్‌ను నష్టపోయింది. కాసేపటికి గఫ్తిల్‌(30), మనీశ్ పాండే(9) వికెట్లను కోల్పోవడంతో 61 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో కేన్‌  విలియమ్సన్‌- విజయ్‌ శంకర్‌ల జోడి 45 పరుగులు జోడించిన తర్వాత విజయ్‌ శంకర్‌(27) పెవిలియన్‌ చేరాడు.

అటు తర్వాత స్వల్ప వ్యవధిలో యూసఫ్‌ పఠాన్‌(3), నబీ(4),  రషీద్‌ ఖాన్‌(1)లు వెనుదిరిగారు. కానీ విలియమ్సన్‌(70 నాటౌట్‌; 43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుతంగా ఆడి జట్టు స్కోరును గాడిలో పెట్టాడు. చివరి ఓవర్ల వరకూ విలియమ్సన్‌ క్రీజులో ఉండటంతో హైదరాబాద్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ 3వికెట్లు సాధించగా, నవదీప్‌ షైనీ 2 వికెట్లు తీశాడు. చాహల్‌, ఖేజ్రోవాలియాలకు తలో వికెట్‌ దక్కింది.