ICC World Cup 2019 కోసం ధావన్‌ను తీర్చిదిద్దుతోన్న గంగూలీ

ICC World Cup 2019 కోసం ధావన్‌ను తీర్చిదిద్దుతోన్న గంగూలీ

Updated On : April 13, 2019 / 9:57 AM IST

ఏ జట్టులోనైనా ఓపెనర్ బలంగా స్థిరపడిపోతే అతణ్ని ఆపడం ఎవరితరం కాదంటున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఈ వరల్డ్ కప్ టోర్నీలో ధావన్ అలా రెచ్చిపోతే భారత్‌కు తిరుగులేదని గంగూలీ వెల్లడించాడు. శుక్రవారం జరిగిన కోల్‌కతా వర్సెస్ ఢిల్లీ మ్యాచ్‌లో 63 బంతుల్లో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు ధావన్.

ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్‌లో గంగూలీ ప్లేయర్లకు విలువైన సలహాలిచ్చాడు. అంతేకాదు.. ధావన్‌ను కోహ్లీసేనకు మంచి ఓపెనర్‌గా నిలవాలనే స్ఫూర్తిని నింపాడు. 

‘ప్రస్తుత వన్డే ఫార్మాట్‌లో భారత్ నుంచి ముగ్గురు బెస్ట్ ప్లేయర్లు ఉన్నారు. ధావన్, రోహిత్, విరాట్‌లు అద్భుతంగా ఆడి మెప్పించగలరు. ధావన్ క్రీజులో నిలదొక్కుకోగలిగితే అతణ్ని ఆపటం ఎవరితరం కాదు. అతను ఏకాగ్రతగా ఉండాలి. అలా ఉంటే ప్రపంచంలో ఏ బౌలర్ అతణ్ని ఆపలేరు’

‘అతను సెట్ అయితే గేమ్‌ను ఎక్కడికో తీసుకెళతాడు. భారత్‌ తరపున ఆడినప్పుడు అలాగే ఆడాలని కోరుకుంటున్నా’ అని ధావన్‌ ఆటను మెరుగులు దిద్దేలా శిక్షనిస్తున్నట్లు చెప్పాడు గంగూలీ.